గెలుపే లక్ష్యంగా టీ- కాంగ్రెస్ మరో భారీ స్కెచ్.. రంగంలోకి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ..!

by Disha Web Desk 19 |
గెలుపే లక్ష్యంగా టీ- కాంగ్రెస్ మరో భారీ స్కెచ్.. రంగంలోకి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల షెడ్యూల్ అతి త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్.. తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు భారీ బహిరంగ సభలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఈ సభలను ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పార్టీ భావిస్తున్నది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ‌తో పాటు హైదరాబాద్ నడిబొడ్డున మరో సభ పెట్టాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. ఈ మూడు రోజులు రాహుల్ గాంధీ హైదరాబాద్‌లోనే స్టే చేసేలా పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. చత్తీస్​ఘడ్, తెలంగాణలో కంటిన్యూగా సభలు పెట్టి ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ మద్ధతను పెంచాలని ఏఐసీసీ వ్యూహా రచన చేస్తోన్నది. రాహుల్‌ని ఇప్పటికే రాష్ట్ర పార్టీ ఆహ్వానించింది. త్వరలోనే తేదీలు ఫిక్స్ అయ్యే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రియాంక చేతుల మీదుగా మహిళా డిక్లరేషన్..?

ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మహిళా డిక్లరేషన్‌ను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. నవంబరు మొదటి వారంలో ప్రకటించాలని పార్టీ కసరత్తు మొదలు పెట్టింది. ప్రియాంక గాంధీని రాష్ట్రానికి రావాలని టీపీసీసీ ఇన్విటేషన్ ఇచ్చింది. ఇక మహిళా డిక్లరేషన్‌లో పొందుపరచాల్సిన అంశాలను పార్టీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నది. ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలను కూడా పార్టీ సేకరించినట్లు సమాచారం. ఉమెన్ సేప్టీ, ప్రైవేట్ కంపెనీల్లో రిజర్వేషన్, ఎంపవర్ మెంట్‌లో ప్రత్యేక ఆర్ధిక సాయం, వంటి అంశాలను డిక్లరేషన్‌లో పొందుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోన్నది.

బీసీ డిక్లరేషన్ ఆలస్యం..?

ఈ నెల 10న జరగాల్సిన బీసీ డిక్లరేషన్ వాయిదా పడే ఛాన్స్ ఉన్నది. ఈ నెల 8న ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ మీటింగ్ ఉన్నది. దీంతో కీలక నేతలంతా ఢిల్లీలోనే ఉండే ఛాన్స్ ఉన్నది. అంతేగాక ఐదు రాష్ట్రాల ఎన్నికల అంశంపై ఆయా నేతలతో ఏఐసీసీ అగ్రనేతలు ఢిల్లీలో ప్రత్యేక మీటింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఈ బీజీ షెడ్యూల్‌లో బీసీ డిక్లరేషన్‌కు మైలేజీ రాదన్న ఉద్దేశ్యంతో బీసీ డిక్లరేషన్‌ను కాస్త ఆలస్యంగా ప్రకటించాలని నేతలు ఆలోచిస్తున్నారు. బీసీ డిక్లరేషన్‌కు చీఫ్​గెస్టుగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు హాజరయ్యే చాన్స్ ఉన్నది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం ఈ ఇరువురి నేతలను కలిసేందుకు బెంగళూరు వెళ్లే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు చెబుతున్నారు.

జనాల్లో జోష్​ నింపేందుకు..

తెలంగాణలో కాంగ్రెస్‌కే అత్యధిక సీట్లు వస్తున్నాయని వివిధ ప్రైవేట్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. పార్టీ ఇంటర్నల్‌గా నిర్వహించిన సర్వేల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ సులువుగా వస్తున్నట్లు తేలిందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. హైకమాండ్ కూడా పలు సర్వేలను పరిశీలించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి వస్తుందని బలంగా నమ్ముతున్నది. దీంతో జనాల్లో మరింత జోష్​నింపి, కాంగ్రెస్ పార్టీకి మద్ధతు పెంచుకోవాలని ఆయా నేతలు భావిస్తున్నారు. దీంతోనే సభలు, ర్యాలీలకు నిర్వహణకు ప్లాన్ చేస్తున్నామని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Next Story

Most Viewed