ఎనిమిదేళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో తీవ్ర నిరాశలో ఉపాధ్యాయులు: టీఆర్‌టీఎఫ్

by Disha Web Desk 19 |
ఎనిమిదేళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో తీవ్ర నిరాశలో ఉపాధ్యాయులు: టీఆర్‌టీఎఫ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టీఆర్‌టీఎఫ్) నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కావలి అశోక్ కుమార్, నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల బదిలీల అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. అంతేకాకుండా పదోన్నతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులు అనుకోని కారణాల వల్ల ఆలస్యం కావడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎనిమిదేళ్లుగా పదోన్నతులు కల్పించకపోవడంతో ఉపాధ్యాయులు నిరాశ నిస్పృహలో ఉన్నారన్నారు.

పైగా ఏండ్ల తరబడి పదోన్నతులు కల్పించకుండా పోస్టులను ఖాళీగా పెట్టడంతో పాఠాశాలలో నాణ్యమైన బోధనకు ప్రతిబంధకంగా తయారైందని పేర్కొన్నారు. పాఠాశాలల పర్యవేక్షణ సైతం గాడి తప్పి విద్యాప్రమాణాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని వెల్లడించారు. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఈ వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ చేపట్టి, బోధన, పర్యవేక్షణ పోస్టులను భర్తీ చేసే విధంగా సత్వరం షెడ్యూల్ విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి విజ్ఞప్తిచేశారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం రాష్ట్ర కార్యదర్శి రమేశ్, ప్రతినిధులు నజీరుద్దీన్, షడ్రక్, లోకేశ్, కుషాల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed