కర్ణాటక ఎన్నికలకు T- బీజేపీ.. తెలంగాణ రాష్ట్ర కీలక నేతకు తెలుగు ఓటర్ల బాధ్యతలు!

by Disha Web Desk 19 |
కర్ణాటక ఎన్నికలకు T- బీజేపీ.. తెలంగాణ రాష్ట్ర కీలక నేతకు తెలుగు ఓటర్ల బాధ్యతలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: దక్షిణాదిలో విస్తరించాలని చూస్తున్న బీజేపీకి కర్ణాటక పీఠాన్ని కాపాడుకోవడం సవాలుగా మారింది. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు ఢీ అంటే ఢీ అనేలా తలపడుతున్నాయి. కాగా అక్కడి ప్రచారాన్ని ఉధృతం చేయడంపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టిసారిస్తోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి తెలంగాణ బీజేపీ నేతలను పంపించనుంది. ఇప్పటికే తెలుగు ఓటర్ల బాధ్యతలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు అప్పగించినట్లు సమాచారం.

అంతేకాకుండా కర్ణాటక రాష్ట్ర కో ఇన్ చార్జీగా ఆమె గతం నుంచే బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమె అటు తెలంగాణ రాజకీయాలతో పాటు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. కర్ణాటక రాష్ట్ర సరిహద్దు గ్రామాల ఓట్లు బీజేపీకి కీలకంగా మారనుండటంతో తెలుగు ఓటర్ల బాధ్యతలు ఆమెకు అప్పగించినట్లు సమాచారం. ఎందుకంటే ఆమె సొంత జిల్లా మహబూబ్ నగర్ పరిసరాలను ఆనుకుని కర్ణాటక బార్డర్ ఉండటంతో ఆమెకు ఈ బాధ్యతలు అప్పగిస్తేనే బాగుంటుందనే నిర్ణయానికి హైకమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది.

కర్ణాటక ఎన్నికలు మే నెలలో జరగనున్నాయి. కాగా ఈ ఎన్నికలకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో బీజేపీ జాతీయ నాయకత్వం మరింత స్పీడ్ పెంచింది. ఇప్పటికే కర్ణాటకలో పలుమార్లు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పర్యటించి వచ్చారు. ప్రచారంలో పాల్గొంటున్నారు. పలు యాత్రల్లో తెలంగాణ తరుపున తన భాగస్వామ్యాన్ని అందించారు.

కాగా త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం పర్యటించనున్నారు. ఒక ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసుకుని కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేయనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లోనూ తెలంగాణ తరుపున పలువురు నేతలు వెళ్లి ప్రచారం చేసి వచ్చిన విషయం తెలిసిందే. అక్కడి తెలుగు ఓటర్ల కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందించుకుని గుజరాత్ ఎన్నికల్లో విజయఢంకా మోగించడంలో తెలంగాణ బీజేపీ నేతలు సత్తా చాటారు.

కాగా అదే సీన్ ను కర్ణాటక ఎన్ఇనకల్లోనూ రిపీట్ చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. బండి సంజయ్ స్పెషల్ టీమ్ తో పర్యటిస్తే.. అదే దారిలో మహిళా మోర్చా నేతలు సైతం వెళ్లనున్నారు. వారు కూడా మహిళా ఓటర్లను చైతన్యవంతుల్ని చేసే బాధ్యతలను స్వీకరించనున్నారు. గుజరాత్ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లను టార్గెట్ గా చేసుకుని చేపట్టిన ప్రచారంలో మహిళా మోర్చా నేతలు తమ మార్క్ చాటుకున్నారు.

కర్ణాటక ఎన్నికలకు కో ఇన్ చార్జిగా డీకే అరుణ కొనసాగుతున్నారు. దానికి తోడు తెలుగు ఓటర్ల బాధ్యతలు కూడా ఆమెకు కేటాయించడంతో ఆమె బిజీగా గడుపుతున్నారు. తెలుగు ప్రాబల్యం అధికంగా ఉన్న పలు జిల్లాలను ఆమెకు కేటాయించినట్లు సమాచారం. అందులో భాగంగా కలుబుర్గి, యాద్గిర్, బళ్లారి, కొప్పల్, బీదర్ 5 జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతను డీకే అరుణకు జాతీయ పార్టీ అప్పగించింది.

ఈ నియోజకవర్గాల్లో పర్యటనటు చేయడంతో పాటు గ్రౌండ్ లెవల్ ప్రచారం చేపట్టాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో తెలుగు ప్రజల ఓట్లు కీలకంగా మారనున్నాయి. విజయసంకల్ప రథయాత్రల పేరిట బీజేపీ ప్రజల్లోకి వెళ్లింది. ఆ పర్యటనలోనూ డీకే అరుణ పాల్గొంటున్నారు. కర్ణాటకను చేజార్చుకోకుండా మళ్లీ అధికారంలోకి తెచ్చుకుని దక్షిణాదితోపాటు తెలంగాణలోనూ తమ సత్తా ఏంటో చాటాలని కమలనాథులు కంకణం కట్టుకున్నారు.


Next Story