సిట్‌కు మరో లేఖ రాసిన T-బీజేపీ చీఫ్ బండి సంజయ్

by Disha Web Desk 19 |
సిట్‌కు మరో లేఖ రాసిన T-బీజేపీ చీఫ్ బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ అతి పెద్ద స్కామ్ అని, దాన్ని కేవలం చిన్న స్థాయి ఉద్యోగులకే పరిమితం చేసి కేసును నీరుగార్చాలని చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. రెండోసారి సిట్ నోటీసులపై ఆయన అధికారులకు లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తాను హాజరు కాలేకపోతున్నానని వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తనకు నమ్మకం లేదని, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో విచారణకు రాలేకపోతున్నట్లు లేఖలో స్పష్టంచేశారు. గతంలోనే తాను రాలేనని చెప్పినా పదే పదే తనకు నోటీసులు పంపిస్తున్నారని, పైనుంచి వస్తున్న ఒత్తిడి కారణంగానే సిట్ నోటీసులు అందిస్తుందనే విషయం కూడా తనకు తెలుసని పేర్కొన్నారు. టీఎస్ పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీలో ముఖ్యంగా గ్రూప్‌-1 పేపర్‌ లీక్‌ అనేది అతి పెద్దదని, ఇది నిరుద్యోగులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.

రాష్ట్ర కేబినెట్‌లోని ఓ బాధ్యతగల మంత్రి ఈ లీకేజీలో కేవలం ఇద్దరి హస్తం మాత్రమే ఉందని చెప్పారని లేఖలో పేర్కొన్నారు. కానీ సిట్ అధికారులకు ఇందులో ఇన్ వాల్వ్ అయిన వారి సంఖ్య చాలా పెద్దదే అనే విషయం తెలిసినా మొదటి నుంచి ఈ సంఖ్యను తక్కువ చేసి చూపించి నీరుగార్చాలని ప్రయత్నిస్తున్నారని చురకలంటించారు. ఒక్కసారి మానసిక క్షోభకు గురవుతున్న లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన నిలబడి ఆలోచించాలని వారికి సూచించారు.

గ్రూప్ 1 పరీక్షలో జగిత్యాల జిల్లాలోని ఒక్క మండలానికి చెందినవారే దాదాపు 100 మంది క్వాలిఫై అయ్యారని, ఇందులో బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు ఉన్నారని తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. తనకున్న సోర్సుల ద్వారా తనకు ఈ సమాచారం అందిందని, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తనకు ఇది తెలుసుకోవడం పెద్ద విషయమేమీ కాదన్నారు. ఆ సమాచారాన్నే తాను పబ్లిక్ డొమైన్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యల ఆధారంగా విచారణ చేపట్టకుండా, ప్రశ్నించిన తనకే నోటీసులు అందించడమేంటని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల కారణంగా తాను విచారణకు హాజరవ్వలేకపోతున్నట్లు స్పష్టంచేశారు.

బండికి బదులు లీగల్ టీం..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి రెండోసారి సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం ఈ విచారణకు ఆయనకు బదులు లీగల్ టీం హాజరుకానుంది. ఈ మేరకు లీగల్ టీం రాష్ట్ర కార్యాలయం నుంచి సిట్ కార్యాలయం నుంచి బయలుదేరింది. ఈ సందర్భంగా లీగల్ టీం సభ్యుడు రామారావు మాట్లాడుతూ.. బండి సంజయ్ స్థానికంగా అందుబాటులో లేడని చెప్పారు. అందుకే ఆయనకు బదులుగా వివరణ ఇవ్వడానికి వెళ్తున్నట్లు చెప్పారు.

Next Story

Most Viewed