క్యాండిడేట్ల ‘సర్వే’ మంత్ర.. ఎప్పటికప్పుడు స్ట్రాటజీలు చేంజ్

by Disha Web Desk 4 |
క్యాండిడేట్ల ‘సర్వే’ మంత్ర.. ఎప్పటికప్పుడు స్ట్రాటజీలు చేంజ్
X

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని వ్యూహాలు రూపొందించుకోవడానికి సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. సర్వేలలో వచ్చిన రిపోర్టుల ఆధారంగా అభ్యర్థులు తమ ప్రచార శైలిని మార్చుకోవడంతో పాటు.. వివిధ కులాలు, సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించి ప్రచారాలు చేస్తున్నారు.

రహస్యంగా సర్వేలు..

ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారాలను రహస్యంగా చేయిస్తున్నారు. కొన్ని సంస్థల నుంచి ప్రత్యేక బృందాలను పిలిపించుకొని మండలాల వారీగా పరిస్థితులను ఏ రోజుకు ఆరోజు తెలుసుకొని అంచన వేసుకుంటున్నారు. స్థానికంగా ఉండే నాయకులు, కార్యకర్తలకు , ప్రజలకు ఏ మాత్రం అనుమానం రాకుండా వివరాలు సేకరిస్తున్నారు. ఆ వివరాలలో తాము సర్వే చేస్తున్న అభ్యర్థికి సంబంధించి ఈ సామాజిక వర్గాలు అనుకూలంగా ఉన్నాయి. ఏ సామాజిక వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆయా సామాజిక వర్గాలలో కీ రోల్ పోషించే ప్రముఖులు ఎవరు.. !? వారు ఏ మేరకు ఓటర్లను ప్రభావితం చేయగలరు..!? అనే అంశాలతో పాటు.. సొంత పార్టీలో ఎవరు బాగా పనిచేస్తున్నారు..!? ఎవరు చేయడం లేదు..!? అన్న వివరాలను సేకరిస్తున్నారు.

అన్ని వర్గాలను ప్రభావితం చేసేలా

గెలుపోటముల విషయంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు చాలెంజ్‌గా తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యర్థులకు.. తమకు మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం.. తదితర అంశాలను గుర్తించి.. పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పెద్ద మొత్తంలో జనం దృష్టిని తమ వైపు తిప్పుకునేందుకు ముఖ్య నేతలను ఆహ్వానించి బహిరంగ సభలు, కార్నర్ మీటింగులు నిర్వహిస్తున్నారు.

భారీగా చెల్లింపులు..

పార్టీల వారీగా రహస్యంగా సర్వేలు నిర్వహిస్తున్నప్పటికీ అభ్యర్థులు ఖర్చుకు వెనకాడకుండా సొంతంగా సర్వేలు చేసుకుంటున్నారు. ఒక్కొక్క అభ్యర్థి పెద్ద మొత్తంలోనే సర్వే నిర్వాహకులకు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు చేస్తున్న సర్వేలు అన్ని ఓటింగ్ నాటికి ప్రభావితం చూపకపోవచ్చు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సర్వేలను అభ్యర్థులు చివరి వరకు కొనసాగిస్తారా.. లేక మధ్యలోనే ఆపి పరిస్థితులను చక్కపరచుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తారా..!? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.



Next Story

Most Viewed