విద్యుత్ సౌధ భవనం జప్తు.. 20 ఏండ్ల నాటి పాత కేసులో కోర్టు ఉత్తర్వు!

by Disha Web Desk 2 |
విద్యుత్ సౌధ భవనం జప్తు.. 20 ఏండ్ల నాటి పాత కేసులో కోర్టు ఉత్తర్వు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఖైరతాబాద్‌లో ఉన్న విద్యుత్ సౌధ భవనాన్ని అటాచ్‌మెంట్ చేస్తూ ప్రిన్సిపల్ స్పెషల్ కోర్టు (ట్రయల్ అండ్ డిస్పోజల్ ఆఫ్ కమర్షియల్ డిస్ప్యూట్స్) ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి కోర్టు విచారణ జూన్ 5న జరగనున్నందున అప్పటివరకూ విద్యుత్ సౌధలోని మూడు వేల చదరపు గజాల స్థలాన్ని విక్రయించడం లేదా గిఫ్ట్ చేయడం లేదా బదలాయించడం లాంటివి చేయొద్దని జడ్జి తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి ఒక కోర్టు కేసు (సీఈపీ నెం. 35/2023 – ఒరిజినల్ పిటిషన్ నెం. ఓపి-253/2011 – ఆర్బిట్రేషన్ అప్లికేషన్ ఒరిజినల్ సూట్ నెం. 29/2005))లో పిటిషనర్‌కు బకాయిలు చెల్లించాలంటూ డిక్రీ జారీ చేసినా విద్యుత్ సౌధలో చీఫ్ ఇంజినీర్ (రూరల్ ఎలక్ట్రిఫికేషన్) (ఏపీ ట్రాన్స్ కో) విఫలమయ్యారని తాజా నోటీసులో జడ్జి పేర్కొన్నారు.

అప్పటిదాకా ఆంక్షలు...

‘విజయ్ ఎలక్ట్రికల్స్ వర్సెస్ సీఈ(ఆర్ఈ), ఏపీ ట్రాన్స్ కో అండ్ టు అదర్స్’ కేసును పలుమార్లు విచారించిన తర్వాత ప్రిన్సిపల్ స్పెషల్ కోర్టు జడ్జి పై నోటీసులు జారీచేశారు. విద్యుత్ సౌధలోని (నెం. 6-3-572, వార్డ్ నెం. 6-3) 3000 చ.గ. మేర భాగాన్ని అటాచ్ చేసినందువల్ల పిటిషనర్ (విజయ్ ఎలక్ట్రికల్స్)కు రూ. 2,56,30,759 చెల్లించేంత వరకు ఈ స్థలాన్ని విక్రయించడం లేదా బదలాయించడంపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఈ భూమిని వేలం వేయడం ద్వారా వచ్చే డబ్బును పిటిషనర్‌కు చెల్లించేందుకు వీలుగా నోటీసులో పేర్కొన్న విధంగా జూన్ 5న కోర్టుకు హాజరు కావాలని సీఈ (ఆర్ఈ)కి మంగళవారం జారీ చేసిన నోటీసుల్లో స్పెషల్ కోర్టు జడ్జి పేర్కొన్నారు. ఆ నోటీసును ఇవ్వడానికి కోర్టు తరఫున ప్రతినిధులు విద్యుత్ సౌధ ఆఫీసుకు చేరుకున్నారు.

ఆ పోస్టే లేదంటూ నోటీసు స్వీకరణకు నిరాకరణ..

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సీఈ (ఆర్ఈ) అనే పోస్టు ట్రాన్స్‌కో సంస్థలో ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పోస్టే లేదంటూ లా డిపార్టుమెంట్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి పేర్కొంటూ నోటీసు తీసుకోడానికి నిరాకరించారు. కొద్దిసేపు కోర్టు ప్రతినిధులు, లా ఆఫీసర్ మధ్య వాదనలు జరిగాయి. సంస్థ హెడ్‌గా సీఎండీ (చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్)కి ఇవ్వడానికి ప్రయత్నించినా నోటీసు ఆయన పేరు మీద లేనప్పుడు ఆయన ఎలా తీసుకుంటారని వాదించారు. చివరకు ఈ నోటీసును విద్యుత్ సౌధ ప్రధాన భవనం తలుపునకు అంటించిన కోర్టు సిబ్బంది ఆ ఫొటోను తీసుకుని కోర్టుకు సమాచారం ఇవ్వనున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు.

20 ఏళ్ల లీగల్ బ్యాటిల్..

విజయ్ ఎలక్ట్రికల్స్ సంస్థ 2005లో తొలుత కోర్టు మెట్లెక్కింది. బకాయిలు చెల్లించనందుకు ప్రాపర్టీని ఎటాచ్ చేయాల్సిందిగా కోరింది. సుదీర్ఘ కాలం పాటు విచారణ జరిగిన అనంతరం పిటిషనర్‌కు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. కానీ వాటిని అమలు చేయకపోవడంతో 2011లో విజయ్ ఎలక్ట్రికల్స్ తరఫున మరో పిటిషన్ దాఖలైంది. పదిసార్లు విచారణను వాయిదా వేయగా చివరకు పిటిషనర్ తరపున విద్యాసాగర్ అనే అడ్వొకేట్ వకాల్తా తీసుకుని గతేడాది డిసెంబరు 18న విద్యుత్ శాఖ చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్ట్స్), నల్లగొండ ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటషన్‌పై విచారణను జూలై 30న జరిగేలా కోర్టు పేర్కొన్నా ప్రత్యేక రిక్వెస్టుతో ఏప్రిల్ 16కు, ఆ తర్వాత జూన్ 5కు వాయిదా పడింది.

చెల్లించకుంటే వేలం..

కోర్టు నోటీసులు జారీచేయడంతో పిటిషనర్‌ (విజయ్ ఎలక్ట్రికల్స్)కు చెల్లించాల్సిన రూ. 2.56 కోట్ల బకాయిని చెల్లించని పక్షంలో ఆ స్థలాన్ని వేలం వేసేలా కోర్టు నిర్ణయం తీసుకునేలా తాజా నోటీసుల్లో సంకేతాలిచ్చింది. ఇందులో భాగంగానే విద్యుత్ సౌధ భూమికి నాలుగు దిక్కులా ఉండే సరిహద్దు వివరాలను కూడా నోటీసులో వివరించింది.


Next Story