RTC కార్మికులకు షాక్.. ఒక్కొక్కటిగా క్లోజ్

by Disha Web Desk 4 |
RTC కార్మికులకు షాక్..  ఒక్కొక్కటిగా క్లోజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ రెక్కలు కత్తిరిస్తూ.. ఒక్కొక్కటిగా క్లోజ్ చేస్తున్నారు. ఇప్పటికే కార్మికుల నుంచి వీఆర్ఎస్ కోసం ఒప్పందాలు చేసుకోవడం కొనసాగుతుండగా.. మరోవైపు 17 డిపోలను ఎత్తివేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఎత్తివేసే డిపోల్లో నుంచి బస్సులను సర్దుబాటు చేస్తున్నారు. వేలాదిమంది కార్మికులకు వచ్చే పెన్షన్ నిలిపివేసేందుకు సమాయత్తమవుతున్నారు. సంస్థ వాటాను చెల్లించే పరిస్థితి లేదంటూ ఆర్టీసీ రిటైర్మెంట్ ​బెనిఫిట్ స్కీం బోర్డును ఎత్తివేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎస్ఆర్‌బీఎస్‌తో పాటు ఎస్బీటీ కూడా ఎత్తివేయనున్నారు. దీనిపై అధ్యయనం సైతం మొదలైందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ విషయమై రెండు రోజుల పాటు ఆర్టీసీ ఎండీ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి బస్​భవన్‌లో సమావేశాలు నిర్వహించి దీన్ని ఎత్తివేయాలనే నిర్ణయం తీసుకున్నారు.

దాచుకున్న సొమ్ముకూ ఎసరు..

ఆర్టీసీలో స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ స్కీం (ఎస్ఆర్‌బీఎస్) కింద కార్మికులు తమ వేతనాల నుంచి ప్రతినెలా రూ.250 చొప్పున దాచుకుంటున్నారు. దీనికి ఆర్టీసీ సంస్థ తరఫున కూడా ప్రతి ఏటా కొంత జమ చేస్తోంది. అప్పటి నుంచి కార్మికులు తమ వేతనాల్లో నుంచి (ఎస్ఆర్‌బీఎస్‌)కు జమ చేసుకున్న మొత్తం రూ.450 కోట్లను ఆర్టీసీ వాడుకుంది. ఉద్యోగులకు ప్రతినెలా వారు దాచుకున్న సొమ్ము నుంచి కనీస పింఛన్ రూ.500 నుంచి రూ.2700 వరకు వస్తోంది. ప్రస్తుతం రిటైరవుతున్న వారికి ప్రతినెలా రూ.2వేల నుంచి రూ.2700 వరకు ఇవ్వాల్సి ఉంది. ఆర్టీసీ కార్మికులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ ​సౌకర్యం లేకపోవడంతో.. ఈ బోర్డును ఏర్పాటు చేసుకున్నారు. అయితే, సంస్థ నష్టాల్లో ఉందనే సాకుతో కార్మికులు దాచుకున్న ఈ సొమ్మును కూడా యాజమాన్యం వాడేసుకుంది. అంతేకాకుండా 2013లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతిఏటా ఎస్‌ఆర్‌బీఎస్‌కు రూ.6.70 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.

ఇప్పుడేం చేస్తున్నారు..

ప్రస్తుతం ఎస్ఆర్‌బీఎస్‌ను పూర్తిగా ఎత్తివేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ ఈ బోర్డుకు కార్మికులు ప్రతినెలా దాచుకున్నది దాదాపుగా రూ.20 కోట్ల వరకు ఆర్టీసీ చెల్లించాల్సి ఉంది. అంతేకాకుండా మూడేండ్ల కాలానికి రూ.21కోట్లు సంస్థ తరఫున చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సి ఉంది. ఈ చెల్లింపులను ఆర్టీసీ భారంగా భావిస్తోంది. అందుకే ఎస్ఆర్‌బీఎస్‌ను ఎత్తివేసేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయంతో కార్మికులకు కనీస పింఛన్ కూడా వచ్చే చాన్స్ లేదు. సర్వీసులో ఉన్నన్ని రోజులు ఎంతో కొంత నెలనెలా దాచుకునే అవకాశం కూడా ఇక లేనట్టే.

బకాయిలిస్తాం..

తాజాగా 'ఆర్టీసీ' కార్మికుల మెడపై కత్తి పెట్టింది. ఎస్‌ఆర్‌బీఎస్ కింద ఇన్నేండ్లు దాచుకున్న సొమ్మును విడుతల వారీగా ఇస్తామంటూ సమాచారమిస్తోంది. పెన్షన్​ రూపంలో కాకుండా.. మొత్తం సొమ్మును లెక్కకట్టి పలు విడుతల్లో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇలా సర్దుబాటు చేస్తామని చెప్పి.. ముందుగానే దీన్ని పూర్తిగా ఎత్తివేయనున్నారు.

ఎస్‌బీటీ కూడా ఖతం..

ఆర్టీసీ కార్మికులకు అత్యవసర సమయంలో అక్కరకు వచ్చే స్టాఫ్​ బెనివోలెన్ట్‌కమ్ త్రిఫ్ట్ ​ఫండ్ ​(ఎస్‌బీటీ)ని కూడా ఎత్తివేసేందుకు పరిశీలిస్తున్నారు. ఇది కూడా కార్మికులు దాచుకున్న సొమ్ము. దీనిలో సంస్థ రూపాయి ఇవ్వదు. ఎస్‌బీటీ అంటే ప్రతినెలా కార్మికులు తమ వేతనాల్లో నుంచి రూ.100 చొప్పున దాచుకుంటారు. దీన్ని రిటైర్మెంట్​ సమయంలో ఎంత వస్తే అంత చెల్లించనుండగా.. ఒకవేళ చనిపోతే రూ.1.50 లక్షల ఆర్థిక సాయంతో పాటు అప్పటి వరకు దాచుకున్న సొమ్మును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా కార్మికుల సొమ్ము నుంచే. అయితే, దీనిలో కూడా కొంత మొత్తాన్ని ఆర్టీసీ వాడుకున్నది. ఎస్ఆర్‌బీఎస్, ఎస్‌బీటీ ఎత్తివేతపై అధ్యయనం చేస్తున్నామని, కమిటీ అధ్యయన నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

Next Story