తుక్కుగూడ సభ వేళ బీఆర్ఎస్ కు షాక్.. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్!

by Disha Web Desk 13 |
తుక్కుగూడ సభ వేళ బీఆర్ఎస్ కు షాక్.. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎంపీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అందులో భాగంగా ఈ నెల 6వ తేదీన తుక్కుగూడలో జనజాతర సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నది. ఈ సభ ద్వారా భారీగా జనాన్ని సమీకరించి తమ సత్తా ఎంటో చాటడంతో పాటు ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా బీఆర్ఎస్‌కు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ స్కెచ్ వేస్తోందనే ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెలో చేరగా వీరి బాటలోనే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు రేపు ఓ ప్రైవేట్ హోటల్‌లో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం. వీలును బట్టి ఏఐసీసీ పెద్దల సమక్షంలో లేదా సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో చేరబోతున్నారని తెలుస్తోంది. దీంతో పార్టీ మారబోయేది ఎవరనేది బీఆర్ఎస్‌లో సస్పెన్స్‌గా మారింది.

కాంగ్రెస్ టచ్ లోకి ఎమ్మెల్యేలు:

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ కావడం చర్చకు దారి తీసింది. ఈ విషయంలో గులాబీ బాస్ కేసీఆర్ తమ ఎమ్మెల్యేలను హెచ్చరించినా వారిలో కొందరు సీఎం వద్దకు వెళ్లడం ఆపలేదు. ఈ క్రమంలోనే దానం, కడియం కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. దీంతో హస్తం పార్టీ మరికొంత మంది బీఆర్ఆర్ ఎమ్మెల్యేలను తమ వైపు చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ టచ్‌లోకి వెళ్లారని సమాచారం. అయితే వారు పైకి తాము పార్టీ మారడం లేదని వివరణలు ఇస్తున్నా సాధ్యసాధ్యాలను బట్టి రేపే కండువా మార్చడం ఖాయమనే చర్చ జరుగుతోంది.

సరైన సమయంలో జంప్..

పార్టీ మారాలనే ఆలోచన ఉన్న ఎమ్మెల్యేలు సైతం తాము కండువా మార్చేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారుతున్న సమయంలో తమతో పాటు తమ అనుచరగణాన్ని వెంట తీసుకువెళ్లేందుకు సరైన రీజన్ కోసం వెతకడం పరిపాటే. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ వ్యవహారాలు బీఆర్ఎస్‌ను ఇరకాటంలోకి నెడుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో సొంత పార్టీ నేతలపై కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వారి కదలికలపై నిఘా పెట్టారనే టాక్ వినిపిస్తోంది. దీంతో వీటినే కారణాలుగా చెప్పి కండువా మార్చేందుకు ఇదే అనుకూల సమయం అనే అభిప్రాయంతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. కడియం కావ్య కూడా ఇదే తరహా కారణాలు చెప్పి ఆమె పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల జరుగుతున్న పరిమామాలతో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న కేసీఆర్.. కాంగ్రెస్ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్‌కు ఎలా అడ్డుకట్ట వేస్తారో అనేది సస్పెన్స్‌గా మారింది.



Next Story

Most Viewed