బ్రిటిష్ వాళ్లు పెట్టిన ఇండియా పేరు దేశానికి ఇంకా అవసరమా..? సింకారు శివాజీ

by Satheesh |   ( Updated:2023-09-05 15:03:16.0  )
బ్రిటిష్ వాళ్లు పెట్టిన ఇండియా పేరు దేశానికి ఇంకా అవసరమా..? సింకారు శివాజీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా‌ పేరును భారత్‌గా మార్చడాన్ని వ్యతిరేకిస్తోన్న కాంగ్రెస్, ఇండియా కూటమిపై శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో దేశం మొత్తం తిరిగినప్పుడు బుద్ది ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. ఇవాళ ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారికంగా ఇండియా పేరును భారత్‌గా మార్చితే స్వాగతించాల్సిన అంశమని.. యావత్ భారత్ దేశ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని.. దీంట్లో తప్పేముందని అని అన్నారు. భారత్ దేశానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ద్వారా భారత్, ఇండియాగా రెండు పేర్లుగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

భారత్ అని పిలవటం వలన కాంగ్రెస్ పార్టీకి ఏం నష్టం జరిగిందో.. లేదో దేశానికి ఏం నష్టం జరిగిందో వాళ్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం దూరం కావడంతో మతి భ్రమించి కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమిలో ఉన్న వారు ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు.

ఈ దేశానికి పట్టిన అతి పెద్ద శని కాంగ్రెస్ పార్టీ అని ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ వలన దేశం ఎంతో వెనక్కి వెళ్లిందని.. ఇప్పుడు కూడా వెనక్కి వెళ్లాలని ఆలోచన చేస్తుందని ధ్వజమెత్తారు. భారత్ దేశానికి కాంగ్రెస్ చేసిన నష్టం ప్రజలకు తెలుసని, ఇండియా కూటమి ద్వారా ప్రజల ముందుకు వెళ్ళిన ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.

Advertisement

Next Story