‘ఉగ్ర’ కేసులో సంచలన విషయాలు.. వికారాబాద్ అడవుల్లో ఫైరింగ్ ట్రైనింగ్

by Disha Web Desk 6 |
‘ఉగ్ర’ కేసులో సంచలన విషయాలు.. వికారాబాద్ అడవుల్లో ఫైరింగ్ ట్రైనింగ్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: కాల్పులు జరిపిన అంశంలో ఉగ్రవాదులకు వికారాబాద్ అడవుల్లో శిక్షణ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రిరిస్ట్ స్క్వాడ్ అధికారులు, తెలంగాణలో కౌంటర్ ఇంటెలిజెన్స్ సిబ్బందితో కలిసి హైదరాబాద్ లో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. మంగళవారం మహ్మద్ సలీం, అబ్దుల్ రెహమాన్, షేక్ జునైద్, మహమ్మద్ అబ్బాస్, హమీద్ అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మహమ్మద్ సల్మాన్ ను బుధవారం అరెస్టు చేసి భోపాల్ కు తరలించారు. వీరిని ప్రాథమికంగా విచారణ జరపగా, అనేక విషయాలు వెలుగు చూసినట్లు తెలిసింది. హిజ్బుత్ తెహ్రీర్ సంస్థలోని ఆర్మ్ డ్ వింగ్ యువకులకు సాయుధ శిక్షణతోపాటు బ్యాక్టీరియల్, బయోలాజికల్ వార్ లో శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడైంది. ఈ సంస్థ దేశంలోని ప్రధాన నగరాల్లో అలజడులు సృష్టించటానికి భోపాల్ కేంద్రంగా కుట్రలు చేసిందని పోలీసు అధికారులు చెబుతున్నారు.

యాసిన్.. అనేక కుట్రలు

హిజ్బుత్ తహ్రీర్ లో యాసీన్ కీలకంగా వ్యవహరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ప్రలోభాలకు గురి చేస్తూ మత మార్పిడిలు చేయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో పట్టుబడ్డ ఆరుగురిలో ముగ్గురు మతం మార్చుకున్నవారేనని వెల్లడించారు. యాసిన్ మాడ్యూల్లో దాదాపు 20 మంది వరకు ఉన్నారని, ఒంటరిగా దాడులు జరిపించాలన్ననే యాసిన్ కుట్ర అని పోలీసు వర్గాలు తెలిపాయి.

ఏ పాపం తెలియదు

తన భర్తకు ఏ పాపం తెలియదని మహమ్మద్ సలీం భార్య రెహాలా అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె పిల్లలు ఆడుకునే పిస్టళ్లను తీసుకొని, ఉగ్రవాద కార్యకలాపాల కోసం కొన్నారని చెబుతున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించింది. హిజామా కోర్సును అభ్యసించేందుకు హైదరాబాద్ వచ్చినట్టు వెల్లడించింది. ఇక, మరో నిందితుడు హమీద్ భార్య హమీదా మాట్లాడుతూ తన భర్తకు టెర్రరిస్టు కార్యకలాపాలతో సంబంధం లేదని తెలిపింది. రోజు కూలీ చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడని చెప్పింది.

Next Story

Most Viewed