సీఎం పోస్ట్‌పై TPCC చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
సీఎం పోస్ట్‌పై TPCC చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం పదవిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ తరపున కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే అని సోషల్ మీడియాలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న తరుణంలో సోమవారం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో షాకింగ్‌కు గురి చేశాయి. సోమవారం వికారాబాద్ కలెక్టరేట్ వద్ద రైతు సమస్యలపై ధర్నా నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను సీఎం కావాలని కొందరు నినాదాలు చేస్తున్నారు. కానీ ఈ వేదిక ద్వారా నేను ఓ విషయం చెప్పదల్చుకున్నా. నేను సీఎం అయినా కాకపోయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి?:

పార్టీలో రేవంత్ రెడ్డిపై చాలా కాలంగా ఓ వర్గం అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఆయన వల్లే పార్టీ సర్వ నాశనం అవుతోందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి పార్టీని వీడుతూ రేవంత్ రెడ్డిని దోషిగా చూపించారు. రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని, రాజులా పార్టీని నడిపిస్తున్నాడని ఆరోపించారు. పార్టీలో సమిష్టి నిర్ణయాలు లేవని ఒంటెద్దు పోకడలే ఉన్నాయని మండిపడ్డారు. ఇక వీరికి తోడు జగ్గారెడ్డి వ్యవహారం రేవంత్ రెడ్డికి అంతుచిక్కడం లేదు. పొగిడినంత సేపట్లోనే తిట్లదండకం అందుకునే జగ్గారెడ్డి పైకి కనిపిస్తున్నంత హ్యాపీగా రేవంత్ తీరుపై లేరనే వాదనలు ఉన్నాయి.

రేవంత్ రెడ్డి విషయంలో వీహెచ్ ఆరోపణలు అందరికి తెలిసినవే. ఇక పీసీసీ పదవి చేపట్టిన ఆరంభంలో రేవంత్‌పై క్యాడర్ లో ఓ నమ్మకం ఏర్పడినా క్రమంగా ఒక్కొక్కరుగా సీనియర్లు పార్టీ నుంచి చేజారిపోవడం, ఎన్నికల్లో వరుసగా పార్టీకి ఘోర పరాభవాలు ఎదురుకావడం రేవంత్ రెడ్డి గ్రాఫ్‌పై ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. దీంతో ఇటీవల హైకమాండ్ సైతం రేవంత్ రెడ్డి విషయంలో సీరియస్‌గానే చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన వ్యూహం మార్చినట్టుగా తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థం అవుతుంది. ఇన్నాళ్లు అన్ని తానే అనేలా హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి రైతు దీక్ష వేదికగా సీఎం విషయంలో సడెన్‌గా సీఎం పోస్ట్ తనకు ఇచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు అనేలా మాటలు మాట్లాడటం ఇటు సొంత పార్టీతో పాటు అటు ప్రత్యర్థుల్లోనూ చర్చగా మారింది.

వారు కలిసి వస్తారా?

రేవంత్ రెడ్డి విషయంలో ప్రతి సారీ సీనియర్లు, జూనియర్లు అనే సమస్య కాంగ్రెస్ పార్టీలో ఉత్పన్నం అవుతూనే ఉంది. ఇటీవల హైకమాండ్ దృష్టికి సైతం ఈ విషయాన్ని ఇరు వర్గాలు తీసుకువెళ్లగా ఇక ఈ అంశంపై చర్చలకు పుల్ స్టాప్ పెట్టాలని పార్టీ పెద్దలు సూచించినట్టు తెలిసింది. ఇక సీనియర్లు, జూనియర్లు అనే విషయాన్ని పక్కన పెట్టి రాబోయే ఎన్నికల కోసం దృష్టి సారించాలని పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారని అదే సమయంలో రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలపై నెమ్మదించాలనే సూచన చేసినట్టు ప్రచారం జరింగింది. పార్టీ పెద్దల సూచనలతోనే రేవంత్ రెడ్డి తాజాగా సీఎం పోస్టు విషయంలో కామెంట్స్ చేశారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి సీఎం పోస్టు విషయంలో వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డికి సీనియర్లు సహకరిస్తారా? అనేది ఆసక్తిగా మారింది. మరో వైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పూర్తిగా పార్టీ కార్యక్రమాల్లో ఇన్ యాక్టివ్ అయిపోయారు.

సీఎం పోస్ట్ తనకు ఇవ్వనక్కర్లేదు అని రేవంత్ రెడ్డి ప్రకటన చేయడంతో ఆయన్ను తిరిగి పార్టీలో యాక్టివ్ చేసే దిశగా అధిష్టానం ఈ రకమైన సంకేతాలు ఇప్పిస్తోందా అనే వాద కూడా తెరపైకి వస్తోంది. ఎందుకంటే సీఎం పోస్ట్ అనేది పార్టీ అధిష్టానం చూసుకునే వ్యవహారం అని గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సహా పలువురు సీనియర్లు అభిప్రాయపడుతూ వచ్చారు. ఈ క్రమంలో పార్టీలో సీఎం పోస్ట్ ఇంకా ఎవరికి కన్ఫార్మ్ కాలేదనే విషయం ఈ రకంగా వెల్లడించడం ద్వారా ఇన్ యాక్టివ్‌గా ఉంటున్న వారినందరిని తిరిగి పార్టీలో యాక్టివ్ చేసే ఉద్దేశం అయి ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. మొత్తంగా తెలంగాణ రాజకీయంలో కల్లోలాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి మరి.

Also Read: నీ బిడ్డ ఇంటికి వస్తే ఆ నొప్పేంటో తెలుస్తుంది: కేసీఆర్‌పై రేవంత్ తీవ్ర విమర్శలు


Next Story

Most Viewed