సర్కార్‌కు కొత్త తిప్పలు.. ఎన్నికల వేళ ఛాలెంజింగా మారిన సెకండ్ ఫేజ్ గొర్రెల పంపిణీ!

by Disha Web Desk 19 |
సర్కార్‌కు కొత్త తిప్పలు.. ఎన్నికల వేళ ఛాలెంజింగా మారిన సెకండ్ ఫేజ్ గొర్రెల పంపిణీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పొలిటికల్ మైలేజ్ పొందేలా దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్న ప్రభుత్వం సెకండ్ ఫేజ్ గొర్రెల పంపిణీ స్కీమ్‌ను నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో లాంఛనంగా ఈ నెల 9న ప్రారంభిస్తున్నది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి రుణం రూపంలో సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినా సాకారం కాలేదు.

సెకండ్ ఫేజ్‌లో సుమారు మూడున్నర లక్షల మందికి ఒక్కో యూనిట్ రూ. 1.75 లక్షల చొప్పున మొత్తం రూ. 6,100 కోట్లను ఖర్చు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో 25% లబ్ధిదారులైన గొల్ల, కుర్మలు భరిస్తుండగా మరో 20% కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది. మిగిలిన 55% భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. ఎన్సీడీసీ నుంచి రుణం తీసుకోడానికి అనుమతి మంజూరైనా నిధుల విడుదలలో జాప్యం జరుగుతున్నది.

మరో మార్గం లేక రాష్ట్ర ప్రభుత్వమే వెయ్యి కోట్ల రూపాయల సొంత నిధులతో స్కీమ్‌ను లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది. కానీ పశుసంవర్ధక శాఖ, షీప్ అండ్ గోట్ సమాఖ్య దగ్గర కలిపి రూ. 535 కోట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇప్పటికే తమ వంతు వాటాగా 2,797 మంది లబ్దిదారులు 25% చొప్పున డిపాజిట్ కట్టిన డబ్బు కూడా ఉన్నది.

లబ్ధిదారులకు ఇవ్వాల్సిన గొర్రెలను కొనడానికి వెటర్నరీ డాక్టర్ సహా పశు సంవర్ధక శాఖ అదికారులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళారు. నకిరేకల్‌లో శుక్రవారం ప్రారంభించనున్న స్కీమ్ కోసం కొన్ని బృందాలు నెల్లూరు, కడప జిల్లాలకు వెళ్ళాయి. ఏయే జిల్లాల్లో పంపిణీ కోసం గొర్రెలను ఏ రాష్ట్రం నుంచి కొనాలనే షెడ్యూలు ఆ శాఖ అధికారులు రూపొందించుకున్నారు. నెల్లూరు జిల్లాలో ‘నెల్లూరు బ్రౌన్’ (దొర), ‘నెల్లూరు జొడిపి’ రకం గొర్రెలను కొనాలని భావిస్తున్నారు.

దీనికి తోడు కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో సైతం గొర్రెలను కొనడానికి కొన్ని టీమ్‌లు వెళ్తున్నాయి. తమిళనాడులో సైతం ‘మద్రాసు రెడ్’ వెరైటీ గొర్రెల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రీసైక్లింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా తెలంగాణ గొర్రెలనే ఆంధ్రలోని గొల్ల, కుర్మలకు అమ్మి తిరిగి వారి నుంచి కొన్నట్లుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

ఫస్ట్ ఫేజ్‌లో జరిగిన గొర్రెల పంపిణీలో రీసైక్లింగ్ జరిగినట్లు విమర్శలు విస్తృతంగానే వచ్చాయి. జియో టాగింగ్ లాంటి చర్యలు తీసుకున్నా అవకతవకలు ఆగలేదు. సెకండ్ ఫేజ్‌లో ఈ ఆరోపణలు రాకుండా పంపిణీ ప్రక్రియను కంప్లీట్ చేయడం ఆ శాఖ అధికారులకు సవాలుగా మారింది. ఒక్కో యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. ఫస్ట్ ఫేజ్‌లో 3.93 లక్షల యూనిట్లను రూ. 5,001 కోట్ల ఖర్చుతో కంప్లీట్ చేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది.

ఫస్ట్ ఫేజ్‌లో ఒక్కో యూనిట్ కాస్ట్ రూ. 1.25 లక్షలుగా మాత్రమే ఉన్నది. దీన్ని సెకండ్ ఫేజ్‌లో రూ. 1.75 లక్షలకు పెంచింది. దీంతో లబ్ధిదారుల వాటా (25%) సైతం రూ. 31,250 నుంచి రూ. 43,750కు పెరిగింది. ఫస్ట్ ఫేజ్‌లో ఎన్సీడీసీ నుంచి 3,955.91 కోట్ల రుణం మంజూరుకాగా ఇందులో రూ. 1,000 కోట్లను కేంద్ర ప్రభుత్వ సబ్సిడీగా ఇచ్చింది. మిగిలిన రూ. 2,955.91 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రుణంగా తీసుకున్నది.

ఆ రుణాన్ని మొత్తం 16 ఇన్‌స్టాల్‌మెంట్లలో చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే అసలు రూ. 2,626 కోట్లను, వడ్డీని రూ. 1,442 కోట్లను మొత్తం పన్నెండు వాయిదాల్లో చెల్లించింది. సెకండ్ ఫేజ్ కోసం రూ. 4,563 కోట్ల మేర రుణం మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్టు పెట్టింది. గతేడాది జూన్ 23న ఈ రుణానికి ఎన్సీడీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమాచారం ఇచ్చింది.

ఆశించిన తీరులో రుణం విడుదల కాలేదు. దీంతో స్కీమ్‌ను ఆపలేక రాష్ట్ర ప్రభుత్వమే తన సొంత నిధులతో ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నది. కానీ అవసరమైనంత స్థాయిలో నిధుల్లేకపోవడంతో దీన్ని కొనసాగించడం సవాలుగా మారింది. ప్రస్తుతానికి రూ. 535 కోట్లతో ఎన్ని యూనిట్లు వస్తే అంత మేరకు పంపిణీ చేయాలని భావిస్తున్నది. ఎన్నికలు జరిగేంత వరకు ఈ స్కీమ్‌ను అమలైనా ఆ తర్వాత కంటిన్యూ కావడంపై అటు లబ్ధిదారుల్లో ఇటు ఆ శాఖ అధికారుల్లో సందేహాలు ఉన్నాయి.

అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కులవృత్తులు చేసుకుంటున్న బీసీలకు కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించే స్కీమ్‌కు కూడా అదే రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాలలో టైమ్ ఫిక్స్ చేశారు. ఎన్నికల వరకూ ఇలాంటి సంక్షేమ పథకాల జోరు ఉంటుందనే అభిప్రాయాలను అధికారుల నుంచి వ్యక్తమవుతున్నాయి.


Next Story