రేపటితో సర్పంచుల పదవీకాలం క్లోజ్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

by Disha Web Desk 2 |
రేపటితో సర్పంచుల పదవీకాలం క్లోజ్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రేపటితో తెలంగాణలో గ్రామ సర్పంచుల పదవీకాలం ముగియనున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి గ్రామా పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ఉంటుందని ప్రకటించారు. ప్రజా సమస్యలపై ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టినా.. సమర్ధవంతంగా పాలించిన సర్పంచ్‌లకు అభినందనలు, శుభాకాంక్షలు చెప్పారు. గ్రామ సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. తప్పకుండా అన్నీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల గ్రామ సర్పంచులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే. తమ పదవీకాలన్ని పొడిగించాలని రేవంత్ రెడ్డిని వేడుకున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగే వరకూ అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రత్యేక అధికారులను నియమించినా తాము విధులకు హాజరయ్యేలా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ హయాంలో తమకు అన్యాయం జరిగిందని.. నిధులు విడుదల చేయకుండా తమ పట్ల వివక్ష చూపిందని కోరారు. వీరి విజ్ఞప్తిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లు తెలుస్తోంది. ఎల్లుండి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన రాబోతున్నట్లు సమాచారం.


Next Story