ఆరోగ్యానికి కంటి నిండా నిద్ర అవసరం: సజ్జనార్

by Disha Web Desk 2 |
ఆరోగ్యానికి కంటి నిండా నిద్ర అవసరం: సజ్జనార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరికీ కంటి నిండా నిద్ర చాలా అవసరమని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్​అన్నారు. నిద్ర సరిగా పట్టకపోతే అలసటగా ఉంటుందని, ఏకాగ్రత కూడా లోపించి పనిమీద శ్రద్ధ తగ్గిపోతుందని ఆయన చెప్పారు. అంతర్జాతీయ నిద్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌ బస్‌భవన్‌లో 'వరల్డ్‌ స్లీప్‌ డే థీమ్‌'ను ప్రముఖ పల్మనాలజిస్ట్‌, స్లీప్‌ డిజార్డర్‌ స్పెషలిష్ట్‌ డాక్టర్‌ వ్యాకరణం నాగేశ్వర్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. కొవిడ్‌ ఉధృతి తర్వాత నిద్ర సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య పెరుగుతోందని పలు అధ్యయానాలు వెల్లడిస్తున్నాయని సంస్థ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. నిద్రలేమి వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయని వివరించారు.

అనవసరమైన పనులతో సమయం వృథా చేయకుండా రాత్రుళ్లు త్వరగా నిద్రపోవాలని సూచించారు. స్మార్ట్‌ఫోన్‌, ఇతర గ్యాడ్జెట్స్‌తో బెడ్‌పై గంటల కొద్దీ గడపొద్దన్నారు. నిద్ర సంబంధిత సమస్యలపై ప్రజలు స్వీయ అవగాహన కలిగిఉండాలన్నారు. సరిగా నిద్రరాకుంటే ట్యాబ్లెట్లు వేసుకోవడం అందరికీ అలవాటుగా మారిందని, వాటి వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఆర్టీసీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీవోవో) డాక్టర్‌ వి.రవిందర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌లు పురుషోత్తం, వినోద్‌ కుమార్‌, మునిశేఖర్‌, సీపీఎం కృష్ణకాంత్‌, సీఎంఈ రఘునాథరావు, సీటీఎం జీవనప్రసాద్‌, సీఈఐటీ రాజశేఖర్‌, సీటీఎం(ఎం అండ్‌ సీ) విజయ్‌ కుమార్‌, రంగారెడ్డి ఆర్‌ఎం శ్రీధర్‌, న్యూట్రిషియనిస్ట్‌ కావ్య, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed