బహుజనులారా మేల్కొనండి.. దొరల గుండెల్లో నిద్ర పోదాం: RSP కీలక పిలుపు

by Disha Web Desk 19 |
బహుజనులారా మేల్కొనండి.. దొరల గుండెల్లో నిద్ర పోదాం: RSP కీలక పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అధికార బీఆర్ఎస్‌లో మరోసారి ఉద్యమకారులకు అవమానం జరిగిందంటూ పలువురు భగ్గుమంటున్నారు. ఇటీవల కేటీఆర్ భూపాలపల్లి పర్యటన సందర్భంగా మాజీ స్పీకర్ మధుసూదనాచారికి అడుగడుగునా అవమానాలు జరిగాయంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్పీ విమర్శలు గుప్పించారు. ఈ దొరల గుండెల్లో గాని గడీల్లో కానీ బహుజనులకు ఎప్పటికీ స్థానం దొరకదని మండిపడ్డారు. అందుకే బహుజన బిడ్డలందరూ మేల్కొని ఈ దొరల గుండెల్లో నిద్రపోదాం రండి అంటూ పిలుపునిచ్చారు. ఎక్కడున్నా మన తెలంగాణ మహనీయులు పాపన్న, సాయన్న, కొమరన్న ఆలవ్వలు, వీరన్న, శ్రీకాంత్, యాదన్నల త్యాగాలను మరువద్దని సూచించారు. శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ పర్యటనలో బయట పడ్డ విభేదాలు:

కాగా, కేటీఆర్ పర్యటన సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మధుసూదనాచారి ఫోటోను ఓ పక్కన చిన్నగా ఉంచగా గండ్రా దంపతుల ఫోటోలకు మాత్రం అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేటీఆర్‌ను స్వాగతించడానికి వచ్చిన మధుసూదనా చారిని, ఆయన అనుచరులను సైతం పోలీసులు అడ్డుకున్నారని.. ఇది ఆయన వర్గానికి చేదు అనుభవం అనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. స్టేజీ మీద సైతం ఆయనకు సరైన గౌరవం దక్కలేదనేది సిరికొండ వర్గీయులు ఆవేదన. ఇతర పార్టీ నుంచి వచ్చిన గండ్రా వెంకటరమణరెడ్డి ఉద్యమకారుడైన మధుసూదనచారిని అణగదొక్కాలని చూస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బీఆర్ఎస్‌లో బీసీలకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇది ఉద్యమకారుడిని అవమానించడమే అంటూ బహుజన నేతలు నిలదీస్తున్నారు. అయితే కేటీఆర్ పర్యటనలో కావాలనే సిరికొండను అవమానించారని ఆయన అనుచరులలో చర్చ జరుగుతోంది. గతంలో కవిత పర్యటనలో టీబీజీకేఎస్ భవన్ నిర్మాణ శంకుస్థాపన ఫలకంలో మధుసూదనచారి పేరు లేకపోవడంపై ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారుడి విషయంలో కావాలనే ఇలా చేస్తున్నారంటూ ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.



Next Story

Most Viewed