ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

by Disha Web Desk 19 |
ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: నరేంద్రమోదీ అంటేనే నమ్మించి మోసం చేయడం అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈవీఎం, ఈడీ, ఇన్ కమ్ ట్యాక్స్, సీబీఐ, అదానీ, అంబానీలంతా మోడీ పరివార్ లైతే, సోనియా, రాహుల్, ఖర్గే, సిద్ధరామయ్య, డీకేలు కాంగ్రెస్ కుటుంబం అని ఆయన వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన జరగాలంటే కాంగ్రెస్ పవర్‌లోకి రావాల్సిన అవసరం ఉన్నదన్నారు. శనివారం ఆయన బెంగళూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఎన్నికలని చెప్పారు. బెంగుళూరుకు ఐటీ నగరంగా గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.

కాంగ్రెస్ కృషి వల్లే ఐటీ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్‌ను మూడుసార్లు గెలిపిస్తే బెంగుళూరుకు ఏం చేశారు..? పార్లమెంట్‌లో బెంగుళూరుకు కావాల్సిన నిధుల గురించి ఏనాడు అడగలేదన్నారు. తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేంద్రం నుంచి నిధులు అడగడం లేదన్నారు. కావేరీ జలాల వివాదం పరిష్కారం గురించి బీజేపీ నాయకులు ఒక్కరూ మాట్లాడటం లేదన్నారు. పీసీ మోహన్ లోక్ సభలో కర్ణాటక సమస్యల గురించి మాట్లాడారా..? అంటూ ప్రశ్నించారు. పల్లీ, బఠానీ తినడానికి ఆయన పార్లమెంట్ సెంట్రల్ హాలుకు పోవాల్సిన అవసరం లేదని, బెంగుళూరు బస్టాండ్‌లో కూడా దొరుకుతాయన్నారు.

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ, పదేళ్లలో 7లక్షల 21వేల 680 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. దేశంలో 62 శాతం యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయన్నారు. దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తున్నందుకు మోదీకి ఓటు వేయాలా..? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోదీ.. రైతులను కాల్చి చంపినందుకు ఓటు వేయాలా..? అంటూ విమర్శించారు. నల్లచట్టాలు తీసుకువచ్చి దేశంలో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు మోదీ కల్పించారన్నారు. నల్లధనం వెనక్కి రప్పించి జన్ ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని ప్రజలను మోసం చేశారన్నారు.

కర్ణాటకలో గ్యారంటీలను కాంగ్రెస్ సంపూర్ణంగా అమలు చేసిందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్‌కు ఓటు వేయాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. గుజరాత్‌కు 7 కేబినెట్ పదవులు, యూపీకి 12 పదవులు ఇచ్చిన మోడీ, కర్ణాటక నుంచి 27 ఎంపీలు ఉన్నా, కనీసం ఒక్క కేబినేట్ పదవి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇది కన్నడ ప్రజలను అవమానించడం కాదా..? అంటూ గుర్తు చేశారు. యూపీ, గుజరాత్‌లోనే సమర్థులు ఉన్నారా..? కర్ణాటక, తెలంగాణలో లేరా..? అంటూ ప్రశ్నించారు. ఇవి ఎన్నికలు కాదని, రెండు పరివార్‌ల మధ్య జరిగే యుద్ధం అని చెప్పారు. ఈ ఎన్నికల్లో కర్ణాటక నుంచి 20 మంది ఎంపీలను గెలిపించాలని, తెలంగాణలో 17 సీట్లకు 14 సీట్లు గెలిపిస్తామన్నారు. మన్సూర్ అలీ ఖాన్‌కు మద్దతుగా నిలిచి గెలిపించాలన్నారు. దేశంలో ఇండియా కూటమీ పవర్ లోకి రావడం ఖాయమన్నారు.



Next Story