కొత్త సెక్రటేరియట్‌లో మీడియాపై ఆంక్షలు.. ఇకనుంచి ప్రెస్​మీట్లన్నీ అక్కడే!

by Disha Web Desk 2 |
కొత్త సెక్రటేరియట్‌లో మీడియాపై ఆంక్షలు.. ఇకనుంచి ప్రెస్​మీట్లన్నీ అక్కడే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన కొత్త సెక్రటేరియట్‌లోకి మీడియా రాకుండా ఆంక్షలు విధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా ఇంటర్నల్‌గా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ప్రధాన కార్యాలయంలోకి ఎంట్రీ లేకుండా చేయాలనే ముందుకుసాగుతున్నది. ఇందులో భాగంగా ప్రాంగణం బయటే మీడియా హాల్‌నూ ఏర్పాటు చేసింది. ప్రెస్​మీట్లు, మీడియా చిట్ చాట్‌లు అక్కడ్నించే జరగనున్నాయి. ఇందుకు కూడా రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఇతర అసిస్టెంట్లకు రెగ్యులర్​గా పరిమిత సంఖ్యలోనే అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. కొత్త సెక్రటేరియట్​లోకి మీడియా ఆంక్షలపై జర్నలిస్టుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి వివక్ష తగదని హెచ్చరించాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితులు లేవని.. స్వరాష్ట్రంలో ఆంక్షలు విధిస్తే సహించేది లేదని జర్నలిస్టుల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే సెక్రటేరియట్​ముందు ధర్నాకు దిగుతామని హైదరాబాద్​యూనియన్​ఆఫ్​జర్నలిస్టు సంఘం హెచ్చరించింది.

తాత్కాలిక భవనంలోనూ అంతే..

ఇన్నాళ్లు తాత్కాలికంగా రాష్ట్ర పరిపాలన భవనంగా కొనసాగిన బీఆర్​కే భవన్​లోనూ మీడియాపై ఆంక్షలు కొనసాగుతూ వచ్చాయి. కేవలం మంత్రులు ప్రెస్​మీట్లు పెట్టినప్పుడే జర్నలిస్టులను అనుమతి ఇచ్చారు. ఆంక్షలు తగదని ప్రభుత్వాన్ని కోరినా స్పందించలేదు. జర్నలిస్టుల పరిస్థితే ఇట్లా ఉంటే సామాన్యులకు ఎలా? ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. డిపార్ట్​మెంట్లకు సంబంధించి వర్క్​తో వెళ్లినా.. లోపలి నుంచి పర్మిషన్లు ఇస్తేనే అనుమతి ఇస్తామని సెక్యూరిటీ తేల్చి చెప్పేది. ఉద్యోగులను కూడా ఐడీ కార్డులు చూపించినా అనుమతించలేదు. ఎన్నోసార్లు వెనుదిరిగిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. ఇప్పుడు కొత్త సెక్రటేరియట్​లోనూ ఇలాంటి పరిస్థితే ఉండొచ్చని ఆర్అండ్​బీకి చెందిన ఓ కీలక అధికారి తెలిపారు.

పేషీలపైనా ఫోకస్..

కొత్త సెక్రటేరియట్​లోని మంత్రులు, ఇతర ఉన్నతాధికారుల పేషీపై సర్కార్​ఫోకస్​పెట్టనున్నది. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ప్రతి నిమిషం రికార్డు కానున్నది. ఎవరు వస్తున్నారు? ఎంత సేపు ఉన్నారు? ఎవరెవర్నీ కలిశారు? ఎన్నిసార్లు ఆయా పేషీలకు వచ్చారు? అనే వివరాలన్నీ నమోదు కానున్నాయి. ప్రభుత్వం ఆదేశాలతో ఇంటలిజెన్స్​ఫోకస్​పెంచనున్నది. మీడియాపై మరింత దృష్టి కేంద్రీకరించనున్నట్లు సమాచారం. ఇందుకు సపరేట్​టీమ్​లను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది.

ఎందుకీ ఆంక్షలు..?

మీడియా ఎంట్రీ అయితే ప్రభుత్వ తప్పిదాలు, నిర్ణయాలతో పాటు మిస్టేక్​లు వంటివన్నీ తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నోసార్లు సర్కార్ తప్పిదాలు ప్రచురితమయ్యాయి. ఎన్నికలు సమీపిస్తుండగా ప్రభుత్వం అతి జాగ్రత్తతో వ్యవహరిస్తున్నది. ఇందుకే మీడియాపై ఆంక్షలు విధిస్తున్నది. ఉన్నతాధికారులను ప్రశ్నించినా.. సెక్యూరిటీ రీజన్స్​అని సమాధామిస్తున్నారు. మీడియాతో ఇబ్బందెంటనేది సదరు అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. పై నుంచి ఆర్డర్​ఎలా ఉంటే.. తాము అలా ఫాలో అవుతామని తేల్చి చెబుతున్నారు. మీడియాపై వివక్ష చూపడం మానుకోవాలని, లేదంటే ప్రభుత్వానికి గుణపాఠం తగదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య హెచ్చరించారు.

ఇదేనా రాజ్యాంగ స్ఫూర్తి?: బి.అరుణ్​కుమార్, హెచ్ యూజే అధ్యక్షుడు

డాక్టర్​బీఆర్​అంబేద్కర్​కొత్త సెక్రటేరియేట్​ప్రారంభోత్సవం రోజు మీడియాతో రాజ్యాంగస్ఫూర్తికి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరించింది. ఓపెనింగ్ కు కొన్ని మీడియా సంస్థల జర్నలిస్టులకు ఎంట్రీ పాస్​లు ఇవ్వకుండా అవమానించింది. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో జర్నలిస్టులపై వివక్ష చూపడం మంచిది కాదు. రాష్ట్ర జర్నలిస్టులను లోపలికి రానివ్వకుండా ఎండలో నిల్చోబెట్టి కవరేజీ ఇచ్చేలా చేయడం అత్యంత దారుణం. ఇతర రాష్ట్రాల జర్నలిస్టులకు రాచమర్యాదలు చేస్తూ రాష్ట్ర ఉద్యమంలో పాలు పంచుకున్న మీడియా సంస్థలు, జర్నలిస్టులను దూరం పెట్టడం సరికాదు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకూడదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కచ్చితంగా మీడియా ప్రతినిధులకు ఆహ్వానం ఇవ్వాలి. అక్రిడేషన్​కార్డు చూపి లోపలికి పంపించే విధానాన్నే మళ్లీ అమలు చేయాలి.

పరాభవం తప్పదు: ఇ.చంద్రశేఖర్​ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్

ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం ఉందని నియంతృత్వ ధోరణి తగదు. పత్రికా, పౌర స్వేచ్ఛను గౌరవించని పాలకులు చరిత్ర పూటల్లో హీనులు, అహంకారులుగా నిలిచినది పాలకులు గుర్తు పెట్టుకోవాలి. ప్రజల పక్షాన కలాన్ని, గళాన్ని విన్పించమే తాము చేసిన పాపంలా అనిపిస్తుంది. ఉమ్మడి ఏపీలోనూ ఇలాంటి వివక్ష చూడలేదు. ప్రభుత్వ ప్రోగ్రామ్ లకు కూడా పరిమిత పాసులు ఏంటి? అంబేద్కర్​సాక్షిగా జర్నలిస్టులకు అన్యాయం జరిగింది. ఇక సహించేది లేదు.



Next Story

Most Viewed