దేవాలయ భూములకు రక్షణేది?

by Disha Web Desk 12 |
దేవాలయ భూములకు రక్షణేది?
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల దేవాలయ భూములున్నాయి. కానీ వీటిని రక్షించడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారే ఆరోపణలున్నాయి. ఇప్పటికే కొన్ని వందల ఎకరాల భూములు కబ్జాలకు గురైనట్లు అనాధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. వాస్తవంగా రికార్డుల్లో, రెవెన్యూ వివరాల ప్రకారం ఎక్కడ భూములు అన్యాక్రాంతం కాలేదనే విషయాలను వివరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆ భూములు మచ్చుకైనా కనిపించక పోవడం విడ్డూరం. ఇప్పటికైనా దేవాదాయ శాఖాధికారులు మేల్కొని భూములను రక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

కానీ ఫిర్యాదులు వచ్చినప్పుడే స్పందించి రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి చేతులు దూలుపుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ తర్వాత ఏమీ జరుగుతుంది... ఏమీ జరిగిందనే విషయాలను ఫాలో చేయకపోవడంతో అక్రమార్కులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా దేవాదాయశాఖ అధికారులు ఆమ్యామ్యాలకు తలొగ్గి ఎన్‌వోసీలు సైతం జారీ చేస్తున్నారనే ప్రచారం సాగుతున్నది. దీంతో రెవెన్యూ అధికారులు ఎన్‌వోసీల ఆధారంగానే క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలుస్తున్నది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,736 ఆలయాలు ఉన్నట్లు అంచనా. వీటికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వందలాది ఎకరాల భూములు ఉన్నాయి. పట్టా భూముల పక్కనే ఈ భూములు ఉండటం, వీటికి సరైన రక్షణ లేకపోవడంతో కబ్జాకు గురవుతున్నాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో 140 దేవాలయాలు ఉండగా, మేడ్చల్‌ జిల్లాలో 101 ప్రముఖ దేవాలయాలు ఉన్నట్లు అంచనా.

వీటికి ఆయా ప్రాంతాల్లో విలువైన భూములు ఉన్నాయి. వీటికి సరైన రక్షణ లేకపోవడంతో ఆక్రమణలకు గురవుతున్నాయి. కొంత మంది భక్తులు, అర్చకులు, పాలక మండళ్లు గుర్తించి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహాస్వామి పేరిట మెయినాబాద్‌ అజీజ్‌నగర్‌ రెవెన్యూ సర్వే నంబర్‌ 67/ఇ/1లో 1.04 ఎకరాల భూమి ఉండగా, సర్వే నంబర్‌ 67/ఇ/2లో 33 గుంటల భూమి ఉంది. 2009లో కనకమామిడికి చెందిన షాపురం బాల్‌రెడ్డి ఈ భూమిని దేవాలయానికి రాసిచ్చారు. ధరణిలోనూ దేవాలయం పేరునే భూమి ఉంది. రూ.15 కోట్ల విలువ చేసే ఈ భూములపై కబ్జాదారుల కళ్లు పడ్డాయి. ఆక్రమణకు గురైనట్లు స్థానికులు గుర్తించి, తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

తొర్రూరులోని సర్వే నంబర్లు 113, 115, 366, 367లలో రంగనాథ స్వామి ఆలయానికి 8 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. కొంతమంది వీటిని కబ్జా చేసేశారు. ఈ భూములను కాపాడా ల్సిందిగా కోరుతూ ఇటీవల ఆలయ కమిటీ మాజీ డైరెక్టర్‌ మంగమ్మ ఇటీవల మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.

సాతంరాయిలోని కోదండరామాలయానికి శంషాబాద్‌ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్‌ 660, 665,668లలో 35.5 ఎకరాలు, గగన్‌పహాడ్‌ రెవున్యూ సర్వే నంబర్‌ 241, 242, 243, 244, 245, 246, 252లలో 35.34 ఎకరాల భూములు ఉన్నాయి. ఆలయానికి మొత్తం 70.84 ఎకరాల భూములు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఏడు ఎకరాలే మిగిలినట్లు తెలుస్తున్నది. రూ.500 కోట్ల విలువైన 63 ఎకరాలు ఇప్పటికే కబ్జాకు గురైంది.

బాట సింగారం పరిధిలోని 1984లో 110 ఎకరాల్లో పంచాయతీ లే అవుట్‌ చేశారు. ఇందులో 11 ఎకరాలు ఆలయానికి, ఇతర ప్రజావసరాలకు కేటాయించారు. ఈ భూమిని ప్రస్తుతం కొంత మంది ఆక్రమించేందుకు యత్నిస్తున్నారు. ఈ భూమిని కాపాడాలని కోరుతూ ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

షాబాద్‌ సీతారామచంద్రస్వామి ఆలయానికి ఉన్న 1,100 ఎకరాల భూమిని ప్రభుత్వం పరిశ్రమల పేరిట స్వాధీనం చేసుకుంది. 600 ఏళ్ల క్రితం దాతలు దేవుడికి రాసిచ్చిన ఈ భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టింది. ఈ భూముల అంశంపై ఇప్పటికే హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం వేశారు. కేసు అడ్మిట్‌ అయింది. దేవుడికి న్యాయం జరిగే వరకు పోరాడతామని హిందూ, సామాజిక, ధార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.

పాలకమండలి సభ్యులే..

ఇలా కేవలం మెయినాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్, శంషాబాద్‌ మండలా ల్లోని దేవాలయాల భూములే కాదు.. జిల్లాలో అనేక ఆలయాలకు ఉన్న విలువైన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. పట్టా భూముల పక్కనే ఈ భూములు ఉండడం, దేవాలయాల భూములకు రక్షణ లేకపోవడంతో కబ్జాకు గురవుతున్నాయి.

విలువైన ఈ భూములకు రక్షణ కల్పించవలసిన పాలక మండళ్లు పట్టించుకోవడం లేదు. దేవుడి భూములకు రక్షణ కల్పించాల్సిన ఈ పాలక మండళ్ల లోని కొంతమంది సభ్యులే ఈ భూములను అన్యాక్రాంతానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు.

మచ్చుకు కొన్ని ఆలయాల భూములు

-జిల్లాలోని యాచారం మండలం నందివనపర్తిలోని ఓంకారేశ్వరాలయానికి 1,450 ఎకరాల భూములు ఉండగా, వీటిలో ఇప్పటికే చాలా వరకు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లింది. మిగిలిన భూమి 1,200 మంది కౌలు రైతుల చేతుల్లోకి వెళ్ళిపోయింది.

- కొందుర్గులోని పెండాల లక్ష్మీనరసింహా దేవాలయానికి 360 ఎకరాల భూములు ఉండగా, వీటిలో ప్రస్తుతం 312 ఎకరాలే మిగిలింది. పది ఎకరాల్లో పక్క రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు ఆక్రమించారు. ఈ భూముల ఆక్రమణలపై 2018లో దేవాదాయశాఖ అధికారులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, మూడు నెలల్లో ఆ స్థలాలను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి.

-బాలాపూర్‌మండలం మామిడిపల్లి శివారులో చారిత్రక రంగనాథస్వామి ఆలయం ఉంది. దీనికి సర్వే నంబర్‌ 99/2లో 15.23 ఎకరాల భూమి ఉంది. ఎకరం భూమిలో కోవెల కొలువై ఉండగా, మిగిలిన భూమంతా ఖాళీగా ఉంది. దీనిపై కూడా రియల్టర్ల కన్ను పడింది. దీనికి సమీపంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన 33 ఎకరాల భూమిని కూడా కబ్జా చేసేందుకు యత్నించగా, స్థానికులు అడ్డుకున్నారు. దేవతల గుట్ట భూములు కూడా పూర్తిగా కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.

Next Story

Most Viewed