రైతులకు మంచి సేవలు అందించాలి.. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి

by Disha Web Desk 20 |
రైతులకు మంచి సేవలు అందించాలి.. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి
X

దిశ, మర్పల్లి : రైతులకు మంచి సేవలు అందిస్తే వారి ఆశీర్వాదం పొందుతారని జిల్లా కలెక్టర్ సీ.నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం మోమిన్ పెట్ మండలం కస్లాబాద్, రాళ్లగుడుపల్లిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ చెరువుల్లో ఉన్న నీరు వృధా కాకుండా రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. చెరువు కట్టలకు సంబంధించిన మరమ్మత్తు పనులను, పూడికతీత పనులను నెలాఖరులోపు పూర్తి కావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కాలువల పూడికతీత పనులు, పొదల తొలగింపుతో పాటు కాలువలు శుభ్రంగా ఉండేలా ప్రతిరోజు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

జాతీయ ఉపాధి హామీపనులు చేపడుతున్న వారికి ఎక్కువ కూలీ వచ్చేలా పనులు చేపట్టి వారి ఆర్థిక అభివృద్ధికి దోహదపడేలా చూడాలని అధికారులకు తెలిపారు. ఉపాధి హామీ కూలీలతో జిల్లా కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కూలీల పనితీరును కలెక్టర్ అభినందించారు. కస్లాబాద్ కాలువకు లీకేజ్ ద్వారా వస్తున్న నీటిని అరికట్టి పూడికతీత, పొదల తొలగింపు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. మోమిన్ పేట మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనమును కలెక్టర్ ఈ సందర్భంగా సందర్శించి నిర్వాహన పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ తహసీల్దారు, మండల అభివృద్ధి అధికారి కార్యాలయాలను సందర్శించారు. తహసిల్దార్ కార్యాలయంలో ఓటరు జాబితాల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ ఎన్నికలకు ఓటర్ జాబితా ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంటుందని అది గుండెకాయ లాంటిదని తెలిపారు. ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు చేసే క్రమంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యాలయాల ఆవరణలో ఆహ్లాదకరంగా, పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కలెక్టర్ పర్యటనలో డీఆర్డీఓ కృష్ణన్, తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీవో శైలజా రెడ్డి, డీఎల్పిఓ అనిత, ఎంపిఓ యాదగిరి, ఏపీఓ శంకర్, ఏపీఎం రాజు, ఇరిగేషన్ ఏఈ వరప్రసాద్, పంచాయతీ కార్యదర్శి అన్నపూర్ణ, సర్పంచ్ సావిత్రమ్మలు ఉన్నారు.

Next Story

Most Viewed