గ్రామాల్లో బెల్ట్ షాపుల హవా... ఒక్కో షాపునకు రూ.10 లక్షలంటా!

by Dishanational1 |
గ్రామాల్లో బెల్ట్ షాపుల హవా... ఒక్కో షాపునకు రూ.10 లక్షలంటా!
X

దిశ, ఇబ్రహీంపట్నం: వీడీసీల సహకారం, అధికారుల అండ వెరసి గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. బెల్ట్​షాపులే కేంద్రంగా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బెల్ట్​షాపుల నిర్వహణకు వీడీసీలు వేలం వేయడంతో వాటిని దక్కించుకునేందుకు గ్రామాల్లో చాలామంది ఆసక్తి చూపుతున్నారు. లైసెన్స్​ఉండి అధికారికంగా నిర్వహించే వైన్స్​షాపుల్లాగే మద్యం విక్రయాలు జరుగుతుండడంతో ప్రతి యేటా బెల్ట్​షాపులకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు గ్రామాల్లో ఒక్కటో రెండో ఉండే బెల్ట్​షాపుల సంఖ్య బాగా పెరిగిందని తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం మండలంలో ఒక్కో బెల్ట్​షాప్ కు రూ. 2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వీడీసీలకు చెల్లించి బెల్ట్​షాపులు దక్కించుకోవడం గమనార్హం. మద్యం విక్రయాల పేరిట వీడీసీలకు భారీగా ఆదాయం సమకూరుతుండడంతో ప్రతి ఏడాదికొకసారి గ్రామాల్లో బెల్ట్​షాపులకు వేలం నిర్వహిస్తున్నారు. మద్యం విక్రయాల పేరిట వీడీసీలు చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నా బహిరంగంగానే అక్రమంగా బెల్ట్​షాపులు నిర్వహిస్తున్నా అటు వీడీసీలపైన.. ఇటు బెల్ట్​షాపు నిర్వాహకులపైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారు. ఫలితంగా గ్రామాల్లో యథేచ్ఛగా బెల్ట్​షాపులు నడుస్తున్నాయి. వీడీసీలు వేలం వేయడం షాపులను దక్కించుకోవడం పరిపాటిగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కిరాణా షాపులు, చికెన్ సెంటర్లే అడ్డా...

ఇబ్రహీంపట్నం మండలంలో మద్యం అమ్మకాలకు ముఖ్యంగా కిరాణ షాపులు, చికెన్ సెంటర్లే అడ్డగా మారాయి. గ్రామాల్లో కొన్నిచోట్ల ఇళ్లలోనే మద్యం అమ్ముతుండగా.. మరికొన్ని చోట్ల కిరాణ షాపులు, చికెన్ సెంటర్ల చాటున మద్యం అమ్మకాలు చేపడుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా బహిరంగంగానే విక్రయాలు సాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే షాపుల్లో మద్యం లభిస్తుందంటే ఏ మేరకు బెల్ట్​షాపులు నడుస్తున్నాయనేది అర్థం చేసుకోవచ్చు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మద్యం పుష్కలంగా లభిస్తున్నా వాటివైపు కన్నెత్తి చూసి పట్టించుకునే వారే లేకుండా పోయారు.

పట్టించుకోని అధికారులు...

అక్రమ బెల్ట్ షాపుల దందా యథేచ్ఛగా నడుస్తున్నా పట్టించుకోవాల్సిన అధికారులు పట్టనట్టు వ్యహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెల్ట్​షాపుల వల్ల మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయని ఎక్సైజ్​శాఖ పరోక్షంగా ప్రోత్సహిస్తుండడం, వేలం సమయంలో ఓ శాఖకు చెందిన అధికారులకు మామూళ్లు అందుతున్నాయనే కారణంతో బెల్ట్​షాపుల విషయంలో ఈ రెండు శాఖలు మిన్నుకుండిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు వైన్స్​షాపులకు బెల్ట్​షాపులే ప్రధాన ఆదాయ వనరులుగా మారడంతో వారు సైతం బెల్ట్​షాపులను ప్రోత్సహిస్తున్నారని సమాచారం.

గతంలో బెల్ట్​షాపులో హత్య...

బెల్ట్ షాపుల్లోనే సిట్టింగ్​లు చేసి మద్యం సేవిస్తున్నారు. దీంతో మద్యం మత్తులో మాటమాట పెరిగి గొడవకు దారితీస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండిలోని ఓ బెల్ట్​షాపు వద్ద ఓ వ్యక్తి హత్యకు గురికావడం ఇందుకు నిదర్శనం. బెల్ట్​షాపు వద్ద మద్యం సేవిస్తుండగా ఇద్దరు వ్యక్తులకు మాటమాట పెరిగి ఘర్షణకు దారితీయగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో కొన్ని రోజులు ఎర్ధండిలో బెల్ట్​షాపులను మూసివేసిన నిర్వాహకులు, కొద్దిరోజులకే తిరిగి ప్రారంభించారు. ఏదేమైనప్పటికీ బెల్ట్​షాపుల విషయంలో అధికారుల ఉదాసీన వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.



Next Story

Most Viewed