కాముని చెరువు పూడ్చివేత కథనానికి స్పందించిన రెవెన్యూ అధికారులు..

by Disha Web Desk 20 |
కాముని చెరువు పూడ్చివేత కథనానికి స్పందించిన రెవెన్యూ అధికారులు..
X

దిశ, శంషాబాద్ : చెరువులు కుంటలు ఎవరు ఆక్రమించినా కఠిన చర్యలు తప్పవని శంషాబాద్ తహసిల్దార్ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కాముని చెరువులో మట్టి నింపి కబ్జాకు పాల్పడుతున్నారని శనివారం దిశ పత్రికలో వచ్చిన కథనానికి స్పందించారు. ఈ క్రమంలోనే సోమవారం రెవెన్యూ అధికారులు, శంషాబాద్ తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో ఆర్ఐ సంజీవ రెవెన్యూ సిబ్బందితో కలిసి కాముని చెరువులో పోసిన మట్టిని జేసీబీ, లారీలతో పూర్తిగా తొలగించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాముని చెరువులో గతంలోనే మట్టిపోసి అక్రమ వెంచర్ చేశారని అప్పటి రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూల్చివేసి కేసులు నమోదు చేశారని అన్నారు. అయినా కబ్జారాయుల్లు వినకుండా మరోసారి కాముని చెరువులో అర్ధరాత్రి సమయంలో లారీలతో మట్టిని తెచ్చి నింపుతున్నారని దిశ పత్రికలో రావడంతో రెవెన్యూ సిబ్బంది అప్రమత్తం అయి చెరువులో నుండి మట్టిని పూర్తిగా తొలగించామని తెలిపారు. అందులో మట్టి పోసిన వారిని గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసులునమోదు చేయించామన్నారు. మరోసారి చెరువులో మట్టిని నింపినట్లు తెలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శంషాబాద్ మండలంలో ఎక్కడైనా చెరువులో, కుంటలు, వాగులలో ఆక్రమణ గురిచేసిన మట్టిని పోసినా నేరుగా తాసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు.


Next Story