నన్ను గెలిపించండి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా : ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి

by Disha Web Desk 11 |
నన్ను గెలిపించండి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా : ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి
X

దిశ, ప్రతినిధి వికారాబాద్ : చేవెళ్ల ఎంపీగా నన్ను గెలిపించండి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గౌలికర్ ఫంక్షన్ హాల్లో వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేముల నరేందర్ రెడ్డి, యాదవ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ… పార్టీలతో సంబంధం లేకుండా పిలిస్తే పలికే ప్రజా నాయకుడు, పేదల సహాయకుడు, మంచి మనసున్న గడ్డం రంజిత్ రెడ్డిని గత ఎన్నికల్లో జరిగిన విషయాలను మర్చిపోయి 1 లక్ష ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరికోరి రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు.

అలాంటి వ్యక్తిని గెలిపించడంకోసం అహర్నిశలు శ్రమించి గెలిపిస్తారని నాకు నమ్మకం ఉందన్నారు. నా కూతురు అనన్య చెప్పినట్లు గత ఎన్నికల్లో రంజిత్ రెడ్డి నాటి సీఎం కేసీఆర్ చెప్పినట్లు పార్టీ కోసమే కట్టుబడి పనిచేసాడు తప్ప నాపై కోపంతో కాదని అన్నారు. ఏది ఏమైనా మా మధ్య జరిగిన ఆ యుద్ధంలో మీరు నన్ను గెలిపించారు. నాపై ఉన్న అదే నమ్మకంతో పెద్ద మనసు చేసుకొని ఇప్పుడు గడ్డం రంజిత్ రెడ్డిని కూడా చేవెళ్ల ఎంపీగా గెలిపించాలని కోరారు.

గడ్డం రంజిత్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించుకుందాం : వేముల నరేందర్ రెడ్డి

వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేముల నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… చేవెళ్ల పార్లమెంట్ స్థానం అంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోట, విజయానికి సెంటిమెంట్ అలాంటి స్థానాన్ని లక్ష మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో బలమైన నాయకత్వం కావాల్సి ఉన్న కారణంగా, ముందు చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా అనుకున్న పట్నం సునీతా మహేందర్ రెడ్డిని అక్కడికి పంపి, మంచి మనసున్న రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించి చేవెళ్ల టికెట్ ఇవ్వడం జరిగిందన్నారు. బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త కష్టపడితేనే భారీ మెజారిటీ సాధ్యం అవుతుంది. సమయం లేదు కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇంటింటికి తిరిగి రంజిత్ రెడ్డి గెలుపుకోసం కృషి చేయాలన్నారు.

శ్రీ అనంత పద్మనాభ స్వామి సాక్షిగా నేను ఏ తప్పు చేయలేదు : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికల్లో నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను ఎంపీగా గెలిపించడానికి సర్వశక్తులు పోరాడుతారు. కానీ గెలిచాగా చేవెళ్ల ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నా దగ్గర మాట తీసుకున్నాడు అని తెలిపారు. సీఎం చెప్పినట్లు చేవెళ్ల ప్రజలు అందరినీ నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ పార్టీలో ఉన్నాను కాబట్టే కేవలం పార్టీకి కట్టుబడి పని చేశానని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా అంతే కట్టుబడి ఉంటాను, దయచేసి ఈ 20 రోజులు నా కోసం కష్టపడి పనిచేస్తే గెలిచాక నన్ను ఎప్పుడైనా కలవవచ్చని హామీ ఇచ్చారు.

రాబోయే ఎన్నికలు చాలా కీలకమైనవి, ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరగనుంది. మతతత్వ బీజేపీ పార్టీని ఓడించడానికి హిందూ, ముస్లిం అందరూ కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. మన రాయకీయాలు ఎక్కువయ్యి దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్లడం లేదు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారాన్ని ఇవ్వాలన్నారు. లౌకికవాదాన్ని ఎంచుకున్న కాంగ్రెస్ ని గెలిపించుకుందామా..? మతతత్వ పార్టీ బిజేపీ ని గెలిపించుకోవాలో మీ అమూల్యమైన ఓటుతో తీర్పు ఇవ్వాలి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఇప్పటికే 4 గ్యారంటీలను అమలు చేసింది. మహిళలకు ఫ్రీ బస్సు కోసం ఇప్పటికి ప్రభుత్వానికి రూ.1700 కోట్లు ఖర్చు అయ్యాయి.

ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రూ.10 లక్షల ఆరోగ్య శ్రీ అమలు చేస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్ కూడా ఊహించలేదు. మహా అయితే 10 సీట్లు పోతాయి అనుకున్నాడు.. చివరికి ప్రజలు రేవంత్ రెడ్డిని గుండెల్లో పెట్టుకొని ముఖ్యమంత్రిని చేశారు. ఈమధ్య కొందరు నాయకులు నేను తప్పు చేశానని నా పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడున్న అనంత పద్మనాభ స్వామి దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నా, నేను ఏ తప్పూ చేయలేదు భవిష్యత్ లో చేయను.

చేవెళ్ల ప్రజల ప్రయోజనాలే నా ఆకాంక్ష, కాబట్టి నాపై అనవసరమైన ఆరోపణలు చేయొద్దని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల, జడ్పిటిసి సంతోష, పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిషన్ నాయక్, రత్నరెడ్డి, సత్యనారాయణ, మహిపాల్ రెడ్డి, కొండల్ రెడ్డి, రాంచంద్రారెడ్డి, రాజశేఖర్, జాఫర్, అనంత్ రెడ్డి, నర్సింలు, కౌన్సిలర్లు మురళి, వేణుగోపాల్, ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ అంజయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



Next Story

Most Viewed