శాసనమండలి ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించాలి

by Disha Web Desk 15 |
శాసనమండలి ఎన్నిక  ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించాలి
X

దిశ, బొంరాస్ పేట్ : శాసనమండలి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం కొడంగల్ పట్టణ కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికకు సంబంధించి కొడంగల్, బొంరాస్ పేట్, దౌల్తాబాద్ మండలాల్లోని 56 మంది ఎంపీటీసీ,

జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటరు జాబితాలోని పేర్లను సరిచూసుకొని పోలింగ్ కేంద్రంలోకి ఓటరుకు ప్రవేశం కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రం వద్ద మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, విద్యుత్తు అంతరాయం లేకుండా చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఓటు వేసేందుకు కొడంగల్ కు వస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, తాండూర్ ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్పీ కరుణా సాగర్ రెడ్డి, సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్సై భరత్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీవో ఉషశ్రీ, తదితరులు పాల్గొన్నారు.


Next Story