షాబాద్ లో ఇంకా ఆగని అక్రమ మైనింగ్...

by Disha Web Desk 11 |
షాబాద్ లో ఇంకా ఆగని అక్రమ మైనింగ్...
X

దిశ, షాబాద్ : షాబాద్ మండలం కేంద్రం అక్రమ మైనింగ్ కు కేంద్ర బిందువు అయింది. షాబాద్ మండలంలో మైనింగ్ అధికారులు ఎంతగా హెచ్చరించిన అక్రమ దారులు మాత్రం తమ వైఖరిని మార్చుకోవడం లేదు. తాజాగా షాబాద్ మండలం తాళ్ళ పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 321/1/2 లోని ఎకరం భూమిలో గత కొద్ది రోజులుగా అక్రమార్కులు ఎర్ర మట్టిని తరలిస్తున్నారు. రెండు జె సి బి లు, ఆరు టిప్పర్ లతో ఈ మైనింగ్ నడుస్తుంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా జెసిబిలు, టిప్పర్లతో మట్టిని తరలిస్తున్న నివారించాల్సిన మైనింగ్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అక్రమ మట్టి తవ్వకాల సమాచారం రెవెన్యూ అధికారులకు తెలిసినప్పటికీ మైనింగ్ వాళ్లు చూసుకుంటారులే అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. మైనింగ్ శాఖ అధికారులు ఎక్కడో నగరంలో వారి కార్యాలయం ఉండడం, వారికి ఫిర్యాదు చేయాలన్నా వారి అడ్రస్ కూడా స్థానికులకు తెలియకపోవడం, తెలిసిన ఫిర్యాదు చేసిన అంతా అయిపోయాక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా వచ్చి చుట్టపు చూపుల షాబాద్ ను దర్శించి వెళుతున్నారే కానీ అక్రమ మట్టి తవ్వకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని వారు సమకూర్చుకోలేకపోతున్నారు. ఈ మట్టిని అధిక ధరలకు వివిధ గ్రామ ప్రజలకు అమ్ముకుంటున్నారు.

ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ఎర్ర మట్టిని తరలిస్తున్నారు. కాంట్రాక్టర్ గా వెల్స్పన్ కంపెనీలోని సూపర్వైజర్ వెంకటేష్ ఈ తతంగం అంతా నడిపిస్తున్నాడు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ మట్టి తవ్వకాలపై దృష్టి సారిస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పత్రికలలో వార్తలు వచ్చినప్పుడు మాత్రమే సంబంధిత అధికారులు హడావిడి చేసి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు...



Next Story