ఉలిక్కిపడ్డ షాద్‌నగర్.. భారీగా అక్రమ నిర్మాణాలు కూల్చివేత

by Web Desk |

దిశ, ఫరూక్‌నగర్: గతకొన్ని రోజులుగా హెచ్‌ఎమ్‌డీఏ అధికారులు అక్రమ కట్టడాలపై కొరడా ఝులుపిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో హెచ్ఎమ్‌డీఏ ఓఎస్డీ, ఎన్ఫోర్స్‌మెంట్ జీవీ రమణ గౌడ్ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. గత డిసెంబర్ నెలలో హెచ్‌ఎమ్‌డీఏ, మున్సిపాలిటీ అధికారులు సర్వే నిర్వహించి షాద్‌నగర్‌ పట్టణంలో మొత్తం 16 అక్రమ కట్టడాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మొదటి విడతగా ఈశ్వర్ కాలనీ, సాయి బాలాజీ వెంచర్‌లలో ఎలాంటి అనుమతులు పొందకుండా 600 గజాల కంటే ఎక్కువ స్థలంలో నిర్మించిన మూడు అక్రమ కట్టడాలను షాద్‌నగర్ పోలీస్, మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో హెచ్‌ఎమ్‌డీఏ అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా పలుచోట్ల అధికారులకు, యజమానులకు స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసు సిబ్బంది సహాయంతో అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా హెచ్ఎమ్‌డీఏ ఓఎస్డీ, ఎన్ఫోర్స్ మెంట్ జీవీ రమణ గౌడ్ మాట్లాడుతూ.. అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని, అక్రమ నిర్మాణాలు చేసినట్లు తమ దృష్టికి వస్తే గృహ నిర్మాణ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీవో పవన్ కుమార్, ఏపీవో దామోదర్, జేపీవోలు సుధీర్, వెంకట్ రెడ్డి, టీపీవో శ్రీనివాస్, ఇన్ఫోర్స్ మెంట్ స్టాఫ్ తదితరులున్నారు.

షాద్‌నగర్ పట్టణంలో చాల వరకు అక్రమ నిర్మాణాలు యథేచ్చగా కొనసాగించారు. జీ+2 వరకే మున్సిపాలిటీలో పర్మిషన్ ఉంటుంది. మిగతా పై భాగంలో నిర్మాణాలను కొనసాగించాలంటే హెచ్‌ఎమ్‌డీఏ పర్మిషన్ తీసుకోవాలి. కానీ, షాద్‌నగర్ పట్టణంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా కొందరు అధికారులను అనుకూలంగా మలుచుకొని నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. పట్టణంలోని చౌరస్తా నుండి మొదలుకొని చాలచోట్ల సెల్లార్‌లు, బహుళ అంతస్తుల నిర్మించారు. కొన్నిచోట్ల కేవలం 80 గజాల స్థలాల్లో నాలుగు నుంచి ఐదు అంతస్తుల నిర్మాణాలు కూడా చేపట్టారు. చాలసార్లు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చినా, యజమానులు వాటిని లేక్కచేయకుండా నిర్మాణాలు కొనసాగించారు. మరి వీరిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.


Next Story