బీఆర్ఎస్ ను 12 స్థానాల్లో గెలిపించండి : కేటీఆర్

by Disha Web Desk 11 |
బీఆర్ఎస్ ను 12 స్థానాల్లో గెలిపించండి : కేటీఆర్
X

దిశ, రాజేంద్రనగర్ : బీఆర్ఎస్ పార్టీకి 10 నుంచి 12 సీట్లు ఇస్తే బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు కేసీఆర్ దగ్గరికి వచ్చి బ్రతిమాలుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా ఆయన మంగళవారం రాజేంద్రనగర్ లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో దేశానికి ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. పదేళ్ల పాలనలో ఎన్డీఏ దేశానికి ఏం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణకు, చేవెళ్ల ఏం చేసిందని ప్రశ్నించారు. చేవెళ్ల నియోజకవర్గం కృష్ణ నీళ్లు తీసుకొస్తామని అన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన రంజిత్ రెడ్డి తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రాముడు అందరి వాడు

శ్రీరాముడు అందరివాడని,ఆయన దేవుడు అని కేటీఆర్ అన్నారు. రాముడి తో ఇబ్బంది లేదని బీజేపీతోనే ఇబ్బంది అన్నారు. బీజేపీ ఓడిపోయిన కూడా రాముడికి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. పదేళ్ల క్రితం క్రూడ్ ఆయిల్ వంద డాలర్లు ఉండగా ఇప్పుడు 84 డాలర్లు ఉందని, మరి పెట్రోల్ రేట్లు ఎందుకు తగ్గడం లేదని ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమికి 200 చొప్పున సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి 10 నుంచి 12 సీట్లు వస్తే కేంద్రంలో చక్రం తిప్పుతుందన్నారు. మనకు కావాల్సిన వాటిని సాధించుకోవచ్చు అన్నారు. బలహీన వర్గాలకు చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. రెండు లక్షల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. పరుగెత్తుకుంటూ రెండు లక్షల రూపాయలు తెచ్చుకోవాలని పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడేమో రుణమాఫీకి ఆగస్టు 15 అంటూ కొత్త గడువు చెబుతున్నారని ఆక్షేపించారు. 11 జీవోను తమ ప్రభుత్వమే ఎత్తివేసిందని తెలిపారు. దాంతో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. కేటీఆర్ ర్యాలీలో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, పార్టీ సీనియర్ నేత స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed