Hyderabad News: అమ్మకానికి రాజీవ్​ స్వగృహ ఇండ్లు.. సర్కార్ కీలక నిర్ణయం

by Disha Web Desk 4 |
Hyderabad News: అమ్మకానికి రాజీవ్​ స్వగృహ ఇండ్లు.. సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజీవ్​ స్వగృహ ఇండ్ల అమ్మకాలపై ప్రభుత్వం ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకున్నది. ఒక్కో ఫ్లాట్ ను అమ్మాలని ఆదేశించింది. ఇప్పటికే టవర్ల వారీగా విక్రయాలు జరిపేందుకు టెండర్లు పిలవగా ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదు. దీనిపై సీఎస్​ సోమేశ్‌కుమార్​ పలు విడతలుగా సమీక్షలు నిర్వహించి ఒక్కో ఫ్లాట్ ప్రాతిపదికన అమ్మేందుకు ప్రతిపాదనలు చేసి సీఎంకు పంపగా ఓకే చెప్పారు.

ధర నిర్ణయానికి కమిటీ

గతంలో బండ్లగూడలో గజానికి రూ.2,700 చొప్పున ధర నిర్ణయించారు. తిరిగి వాటిని సవరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందు కోసం జీహెచ్‌ఎంసీ కమిషనర్​ లోకేశ్‌కుమార్, సీడీఎంఏ డైరెక్టర్​ సత్యనారాయణ, గృహ నిర్మాణ సంస్థ సీఈ ఈశ్వరయ్య, హెచ్‌ఎండీఏ సీఈ బీఎల్‌ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ వేశారు. రాజీవ్​స్వగృహ నిర్మాణాలున్న ప్రాంతాల్లో భూముల ధరలు, ప్రస్తుత నిర్మాణ వ్యయాన్ని అంచనా వేసి ధర నిర్ణయించాలని ప్రభుత్వం ఈ కమిటీకి సూచించింది. ఈ నెలాఖరులోగా ధర ఖరారు చేయాలని ఆదేశాలిచ్చింది.

యథాతథంగా అమ్మకాలు

టవర్ల వారీగా అమ్మకాలు జరిపితే మొత్తం పూర్తి చేసి అమ్మాలనుకున్న ప్రభుత్వం.. విడివిడిగా అమ్మకాలకు మాత్రం నిబంధనలు మార్చుతున్నది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోనే వాటిని విక్రయానికి పెట్టాలని సూచించింది. దీని ప్రకారం ధర ఖరారు చేయాలని కమిటీకి సూచించింది. ప్రస్తుతం బండ్లగూడలో నిర్మాణాలు 90 నుంచి 95%, పోచంపల్లిలో 90%, గాజుల రామారంలో 60% పూర్తయ్యాయి. ఇలా ఆయా ప్రాంతాల్లో యథాతథంగా నిర్మాణాలు ఆపేసి అమ్మకానికి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వాస్తవానికి ఈ ఇండ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేయడం లేదు. దీనిపై కోర్టులో పిటిషన్​ దాఖలైంది. స్వగృహ ఇండ్లు అమ్మే ముందు తమకు రావాల్సిన బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ల కోర్టుకెక్కారు. దీనిపై విచారణ సాగుతున్నది.

పార్కింగ్​ స్థలంపై తిరకాసు

బండ్లగూడతో పాటు పలు ప్రాంతాల్లో పార్కింగ్​స్థలంపై తిరకాసు నెలకొన్నది. గతంలో హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు రాజీవ్​స్వగృహ నివాస ప్రాంతాల్లో సెల్లార్ ​మొత్తం మునిగిపోయింది. సెల్లార్‌లో పార్కింగ్​ చేయొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు నిబంధనలు పెట్టారు. పార్కింగ్​స్థలం లేకపోతే కొనుగోళ్లకు ముందుకు రారని భావించిన ప్రభుత్వం..నివాస సముదాయాల మధ్య రోడ్లపై సగం పార్కింగ్​కోసం గుర్తులు పెట్టాలని సూచించింది. అంటే రోడ్లపైనే పార్కింగ్​ చేసుకోవాలని చెప్పినట్టు లెక్క. దీనిపై ఇప్పటికే నివాసముంటున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి అమ్మకాలకు టెండర్లు పిలిచేలోగా పార్కింగ్​ స్థలంపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.



Next Story