బతుకమ్మ ఉత్సవాలకు రంగం సిద్ధం.. ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్‌గా ఏర్పాట్లు

by Disha Web Desk 2 |
బతుకమ్మ ఉత్సవాలకు రంగం సిద్ధం.. ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్‌గా ఏర్పాట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రాండ్‌గా బతుకమ్మ సంబురాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. రాష్ట్ర రాజధానితో పాటు అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఆర్కే భవన్‌లో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ నెల 25 నుంచి అక్టోబర్ 3 వరకు బతుకమ్మ పండుగ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ.. సద్దుల బతుకమ్మను అక్టోబర్ 3న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాజధానిలోని ట్యాంకుబండ్ వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలని, ప్రధానంగా బతుకమ్మ ఘాట్, ట్యాంక్ బండ్, పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ, రోడ్డు రిపేర్ వర్క్స్ వెంటనే చేపట్టాలన్నారు. ఈ సారి మహిళలు ఉత్సవాలలో భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. బతుకమ్మలను నిమ్మజ్జనం చేసే ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగకుండా గజ ఈతగాళ్లను నియమించాలని, బతుకమ్మ పండగపై ఆకర్షణీయమైన డిజైన్‌లతో మెట్రో పిల్లర్లను అలంకరించాలని ఆదేశించారు.

ఎల్బీ స్టేడియం, నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలన్నారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వాహణ, ట్యాంక్ బండ్ వద్ద విద్యుత్ దీపాలంకరణ, బారికేడింగ్, తాగునీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్స్, మొబైల్ టాయిలెట్స్, నిరంతర విద్యుత్ సరఫరా, ఉత్సవాల లైవ్ టెలికాస్ట్ ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ డైరెక్టర్ జనరల్ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సమాచార శాఖ కమిషనర్ అరవింద్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జల మండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed