‘విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలి’

by Dishanational2 |
‘విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలి’
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు పీఆర్‌సీని అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సంస్థలో 70 వేలకు పైగా కార్మికులకు, ఉద్యోగులకు, ఇంజనీర్లకు, ఆర్టిజన్స్‌కు, రిటైర్డ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల 2022 నుంచి అమలు చేయవలసిన పీఆర్‌సీని అమలు చేయడంతో మూడు లక్షల కుటుంబాలకు న్యాయం జరుగుతున్నదన్నారు.

ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సంస్థల్లో 1999 నుంచి 2004 వరకు ఉద్యోగంలో చేరిన వారికి రాష్ట్రంలో మిగతా ప్రభుత్వ రంగ సంస్థల్లో మాదిరిగా ఈపీఎఫ్ టూ జీపీఎఫ్‌నీ అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు కార్మికులు గా పనిచేస్తున్న సుమారు 23 వేల మందిని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిజన్స్‌గా గుర్తించిందని, వారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. 2018 సంవత్సరంలో జరిగిన పీఆర్సీలో పది శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి అన్యాయం చేశారని, ఇప్పుడు జరగబోయే పీఆర్సీలో న్యాయం జరిగేటట్టు తగు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. టీఎస్ జెన్‌కోలో పనిచేస్తూ దురదృష్టవశాత్తు చనిపోయిన కార్మిక కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరణించిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చిన తర్వాత వారు కూడా మరణిస్తే రెండో నియామకం కూడా ఇవ్వాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసి 2017 సంవత్సరంలో విలీనం అయిన సందర్భంలో అన్ని అర్హతలు కలిగిన కొంతమంది అర్హులైన వారు ఆర్టిజన్స్‌గా గుర్తింపు పడలేదని, వారికి కూడా ఆర్టిజన్స్‌గా నియమించాలని కూనంనేని డిమాండ్ చేశారు


Next Story