పీకేకు సోనియా బంపర్ ఆఫర్.. కాంగ్రెస్‌లో కీలక పదవి

by Disha Web Desk 4 |
పీకేకు సోనియా బంపర్ ఆఫర్.. కాంగ్రెస్‌లో కీలక పదవి
X

న్యూఢిల్లీ: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) కాంగ్రెస్‌లో చేరడం ఖాయమేనని తెలుస్తున్నది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఇప్పటికే రెండు సార్లు కలిసిన పీకే.. దేశంలో కాంగ్రెస్ కు పూర్వవైభవం తేవడం, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కీలక సంస్కరణలు ప్రతిపాదనలు చేసినట్టు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. పార్టీలో చేరి కీ రోల్ ప్లే చేసే అధికారం తనకు ఇవ్వాలని సూచించారని అంటున్నారు. కాంగ్రెస్ కు ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పీకే చేసిన ప్రతిపాదనలకు సోనియా సానుకూలంగానే స్పందించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్‌కు ఉపాధ్యక్ష పదవి ఇవ్వనున్నట్టు తెలిపాయి. దీనిపై మరింతగా చర్చించేందుకు ప్రశాంత్ కిషోర్, సోనియా గాంధీ శుక్రవారం భేటీ కానున్నట్టు జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. 'పార్టీలో చేరికకు సంబంధించిన అంశాన్ని చర్చించేందుకు పీకే శుక్రవారం సోనియాను కలవనున్నారు. కాంగ్రెస్ బలోపేతానికి అనుసరించాల్సిన అంశాలతో కూడిన ప్రెజెంటేషన్‌ను తయారు చేశారు. మొత్తం 600 స్లైడ్లు ఉన్నాయి' అని పార్టీలోని ఓ కీలక నేత తెలిపినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. ఇప్పటికే ఈ నెల 16,18న కలిసిన ఆయన.. శుక్రవారం మరోసారి కలిసి తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. దేశంలో దాదాపు 100 లోక్‌సభ సీట్లపై ప్రభావం చూపగలిగే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పీకే సమావేశం కానున్నట్టు సమాచారం. వీరిని కలిసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు పలికే అంశంపై చర్చించనున్నారని తెలుస్తున్నది.

'కాంగ్రెస్ 2.0'కు పీకే ప్రెజెంటేషన్

ఈ నెల 16న కాంగ్రెస్‌ చీఫ్ సోనియా గాంధీ, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను ప్రశాంత్ కిషోర్ కలిసిన విషయం తెలిసిందే. వీరి భేటీలో పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్లు, 2024లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను పీకే ప్రెజెంటేషన్ ఇచ్చారు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు. గతేడాది సైతం గాంధీలకు ఇదే తరహా ప్రెజెంటేషన్‌ను ఇచ్చారు. దీనిని జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ సంపాదించింది. ఈ ప్రెజెంటేషన్‌లో కాంగ్రెస్ 2.0 ప్లాన్ ఉందని, తాజా ప్రెజెంటేషన్‌లోనూ ఇదే తరహా ప్రతిపాదనలు చేసుంటారని సదరు మీడియా సంస్థ తెలిపింది.

గతంలో పీకే చేసిన ప్రతిపాదనలను ఓసారి పరిశీలిస్తే..

= కాంగ్రెస్‌ను సరికొత్తగా తీర్చిదిద్దడం

=పార్టీ విలువలు, ప్రధాన సూత్రాలను పరిరక్షించడం

= పొత్తులపై పూర్తి స్పష్టత కలిగి ఉండటం

=కుటుంబ రాజకీయాల ముద్ర పోగొట్టుకునేందుకు 'ఒక కుటుంబం ఒకే టికెట్' విధానం అమలు

=పార్టీలోని అన్ని స్థాయిల్లోని సంస్థాగత వ్యవస్థలను ఎన్నికల ద్వారా పునర్నిర్మించడం

=కాంగ్రెస్ అధ్యక్షుడు, వర్కింగ్ కమిటీ సహా పార్టీలోని అన్ని పోస్టులకూ పదవీకాలాన్ని నిర్ణయించడం

=దేశవ్యాప్తంగా 15వేల మంది అట్టడుగు స్థాయి నాయకులను గుర్తించడం

=కోటి మంది సైనికులను క్రియాశీలకం చేయడం



Next Story

Most Viewed