కేంద్రం బాటలో సీఎం KCR.. అదే ఫార్ములాతో బీజేపీకి బ్రేక్

by Disha Web Desk 4 |
కేంద్రం బాటలో సీఎం KCR.. అదే ఫార్ములాతో బీజేపీకి బ్రేక్
X

రాష్ట్రంలో రాజకీయ యుద్ధ వాతావరణ నెలకొన్నది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ఇరుపార్టీల మధ్య విమర్శలు, ఆరోపణల స్థాయి ఎప్పుడో దాటి పోయింది. ఇటీవల ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాంలో భాగస్వామి అని పేర్కొంటూ బీజేపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే ఢిల్లీలో చేసిన విమర్శలతో పరిస్థితి మరింత అదుపు తప్పింది. కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలను ప్రయోగిస్తే.. రాష్ట్ర పోలీసులు పీడీ చట్టాన్ని ఆయుధంలా మార్చుకున్నారు. తగ్గేదే లేదనే రీతిలో పోలీసులు దూకుడును పెంచారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉందనే వాదన బలంగా వినిపిస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయ వైరం రోజురోజుకూ వేడెక్కుతున్నది. హుజూరాబాద్ ఉప ఎన్నికతో మొదలైన రాజకీయ వైషమ్యం ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితకు లిక్కర్ స్కాంలో భాగస్వామిగా పేర్కొంటూ ఢిల్లీలో బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. దీనికి ప్రతిగా టీఆర్ఎస్ సైతం దూకుడుగానే వ్యవహరించింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్టు వరకూ వెళ్లింది. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు పోలీసు యంత్రాంగాన్ని బీజేపీపై ప్రయోగిస్తున్నది. కంటికి కన్ను.. పంటికి పన్ను తరహాలో వ్యవహరిస్తున్నది. పరస్పరం ఆరోపణలు చేసుకునే ఈ రెండు ప్రభుత్వాలు ఒక పార్టీపై మరొకటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నిప్పు రాజేసిన 'లిక్కర్' కామెంట్స్

ఈడీ, ఐటీ, సీబీఐ లాంటి సంస్థలను ఉసిగొల్పుతున్నదని, రాజకీయంగా లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నదని సాక్షాత్తూ ముఖ్యమంత్రే వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ విషయంలో తొలుత సీబీఐ రంగ ప్రవేశం చేసినా ఇప్పుడు ఈడీ (ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) ఎంటర్ అయింది. కీలక సూత్రధారి అనే ఆరోపణలతో ఢిల్లీ రాష్ట్ర డిప్యూటీ సీఎం పేరును చేర్చింది. అదే స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ప్రమేయం ఉన్నదంటూ బీజేపీ ఆరోపించింది. అంతటితో ఆగక లింకు ఉన్నవారికి సీబీఐ నుంచి నోటీసులు తప్పవంటూ కామెంట్ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో వాసవి, ఫీనిక్స్ లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ దాడులు జరిగాయి. చీకోటి ప్రవీణ్ కాసినో వ్యవహారంలో మనీలాండరింగ్ చోటుచేసుకున్నదని ఈడీ కూడా రంగంలోకి దిగింది. బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాన్నే ఇప్పుడు టీఆర్ఎస్ కూడా అమలుచేస్తున్నది. బీజేపీ దూకుడుకు బ్రేక్ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్నది. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కవిత పేరును బీజేపీ నేతలు ప్రస్తావించడంతో రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇరు పార్టీలు పరస్పరం వ్యూహరచన మొదలు పెట్టాయి. రాజకీయంగా అమీతుమీ తేల్చుకునే ఎత్తుగడలకు పదునుపెట్టాయి. అధికారంలోకి రావడానికి బీజేపీ, ప్రస్తుతం ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోడానికి టీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. లిక్కర్ స్కాం ఆరోపణలకు కొనసాగింపుగా బీజేవైఎం కార్యకర్తలు హైదరాబాద్‌లోని కవిత నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. పోలీసులు సీరియస్‌గానే అడ్డుకున్నారు. వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. దీనికి ప్రతిగా బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా ఒక రోజు నిరాహారదీక్షకు దిగారు. ఆ ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. అదుపులోకి తీసుకుని వరంగల్ నుంచి కరీంనగర్ తరలించారు. చివరకు ఆయన పాదయాత్రకు అనుమతి లేదంటూ వర్ధన్నపేట ఏసీపీ నిషేధాజ్ఞలు విధించారు. బీజేపీ చివరకు హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నది. పాదయాత్ర ఆగిపోయిన చోటు నుంచే మళ్లీ మొదలైంది. ఈ ఉత్సాహంతో ఈ నెల 27న హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు మొదలుపెట్టింది.

ఆద్యంతం నాటకీయ పరిణామాలు

తొలుత పర్మిషన్ ఇచ్చిన కాలేజీ యాజమాన్యం ఆ తర్వాత ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. టీఆర్ఎస్ రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి ఈ కుట్రకు పాల్పడిందంటూ బీజేపీ ఆరోపించింది. ఇదే సమయంలో వరంగల్ పోలీసు కమిషనర్ హన్మకొండలో బీజేపీ బహిరంగసభకు అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు. పోలీసు చట్టంలోని సెక్షన్ 30ని ప్రయోగించారు. సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించారు. చివరకు దీన్ని కూడా హైకోర్టుకు వెళ్లి సవాలుచేసింది బీజేపీ. కొన్నిషరతులు, ఆంక్షలతో హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని సూచించింది. మధ్యలో పాదయాత్రలో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. బహిరంగసభకు కాలేజీ యాజమాన్యం గ్రౌండ్ పర్మిషన్‌ ఇవ్వడానికి నిరాకరించడం, పాదయాత్రపై వర్ధన్నపేట అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ఆంక్షలు విధించడం, చివరకు బహిరంగసభకు కూడా పోలీసు కమిషనర్ నిషేధం విధించడం.. ఒకదాని తర్వాత ఒకటిగా తెరపైకి వచ్చాయి. కోర్టు నుంచి సానుకూల నిర్ణయం వెలువడడంతో బీజేపీలో ఉత్సాహం పెరిగింది. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం కూడా టీఆర్ఎస్ శ్రేణులకు, పోలీసులకు బాగా కలిసొచ్చింది. ఆయన చేసిన వివాదాస్పద ప్రసంగం చివరకు పీడీ యాక్టు నమోదు చేయడానికి పోలీసులకు ఒక అస్త్రంలాగా పనిచేసింది. బీజేపీ కూడా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయక తప్పలేదు.

యాక్షన్.. రియాక్షన్

కేంద్ర ప్రభుత్వం ఈడీని ప్రయోగిస్తే రాష్ట్ర పోలీసులు పీడీ చట్టాన్ని ప్రయోగించారు. తగ్గేదే లేదు.. అనే తీరులో పోలీసులు దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగించి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతూ ఉంటే రాష్ట్రం ప్రభుత్వం కూడా అదే తీరులో వ్యవహరిస్తున్నదనే జనరల్ టాక్ మొదలైంది. హన్మకొండలో ఆర్ట్స్ కాలేజీ యాజమాన్యం అనుమతి నిరాకరించడం, బహిరంగసభకు అనుమతి ఇవ్వకుండా పోలీసు యాక్టులోని సెక్షన్ 30ని ప్రయోగించడం వెనక టీఆర్ఎస్ ఒత్తిడి ఉన్నదని బీజేపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. రెండు పార్టీల మధ్య హెచ్చరికలు, బెదిరింపుల స్థాయి దాటిపోయి ఇప్పుడు యాక్షన్, రియాక్షన్ స్థాయికి చేరుకున్నది.రానున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఈ రెండు పార్టీల మధ్య ఘర్షణ ఏ రూపం తీసుకుంటుందోననే అలజడి మొదలైంది. ఇప్పటికే పాదయాత్రలను అడ్డుకోవడం, పోటాపోటీగా బహిరంగసభలను నిర్వహించడం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానిపై మరొకటి విమర్శలు చేసుకోవడం, ప్రధాని-ముఖ్యమంత్రులు పరస్పరం ఆరోపించుకోవడం బీజేపీ-టీఆర్ఎస్ పార్టీలు ఒకదాని అవినీతిని మరొకటి తెరపైకి తేవడం.. ఇవన్నీ ఊపందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీల మధ్య ఎలాంటి హింసాత్మక చర్యలకు కారణమవుతుందోననే ఆందోళన మొదలైంది. కాంగ్రెస్‌తో కలిసి ముక్కోణపు పోటీ అనే రాజకీయ వాతావరణం స్థానంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే చర్చలు మొదలయ్యాయి.

KCR సభకు రానందుకు రూ.500 ఫైన్.. మహిళలకు ప్రభుత్వం హెచ్చరిక


Next Story