ఒకే నెలలో తెలంగాణకు Modi, Amit Shah, J P Nadda.. ఎన్నికల వేళ టీ- బీజేపీ బిగ్ స్కెచ్..!

by Disha Web Desk 19 |
ఒకే నెలలో తెలంగాణకు Modi, Amit Shah, J P Nadda.. ఎన్నికల వేళ టీ- బీజేపీ బిగ్ స్కెచ్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వాడిపోతున్న కమలాన్ని వికసించేలా చేయడంపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. అగ్ర నేతల వరుస పర్యటనలతో శ్రేణుల్లో జోష్ పెంచాలని చూస్తోంది. అక్టోబర్ 1వ తేదీన పాలమూరుకు ప్రధాని మోడీ రానున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లోని ఐటీఐ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

వచ్చే నెల మొదటి వారంలో ఆదిలాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. సభను నిర్మల్‌లో పెట్టాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి పట్టుపడుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌కు రానున్నారు. షా పర్యటన తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు.

ఏం ఇచ్చాం.. ఏం ఇవ్వాలి

కవిత లిక్కర్ కేసు విషయంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేననే చర్చ ప్రజల్లో జరుగుతోంది. దాంతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడం సైతం పార్టీకి మైనస్ అయింది. ఆ నష్టాన్ని పూడ్చుకోవడంలో భాగంగానే అగ్ర నేతల వరుస పర్యటనలు ఉండనున్నాయని తెలుస్తోంది. తెలంగాణకు ఇప్పటి వరకు ఏమిచ్చామో చెప్పుకుని పార్టీని పటిష్ట పర్చడంతోపాటు ప్రజలకు దగ్గరయ్యేలా హామీలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఒక్కొక్కరు మూడేసి సభలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు మోడీ, అమిత్ షా, నడ్డా ఒక్కొక్కరు మూడు చొప్పున మొత్తం 9 భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మోడీ, షా, నడ్డాతో మూడు సభలు నిర్వహించనుంది. ఈ షెడ్యూల్ పూర్తయ్యే లోపు మరో దఫా ఈ నేతలు పర్యటించనున్నారు.

పాలమూరు సభ అనంతరం అక్టోబర్ 3వ తేదీన నిజామాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. పసుపు బోర్డు ఏర్పాటుపై మోడీ స్పష్టత ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌లో ప్రధానితో రోడ్ షో నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. దీని కోసం అర్వింద్ పట్టుపడుతున్నారు. అది సాధ్యపడకుంటే బహిరంగ సభ నిర్వహించాలని చూస్తున్నారు. నల్లగొండలోనూ ప్రధాని మోడీ తో సభ నిర్వహించాలని చూస్తున్నారు.

అక్టోబర్‌లో షా రాక

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కరీంనగర్‌లో సభ పెట్టాలని బండి ప్రణాళిక చేస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ మొదటి వారంలో 6వ తేదీ లోపే రాష్ట్రానికి అమిత్ షా రానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆపై నడ్డా టూర్ సాగనుంది. బస్సుయాత్రల స్థానంలో కొత్త జిల్లా కేంద్రాల వారీగా సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ లోపు మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు పూర్తి చేయాలని కమలనాథులు భావిస్తున్నారు.

రాష్ట్ర కార్యవర్గ సమావేశం డౌటే..?

వచ్చే నెల 1వ తేదీన నిర్వహించతలపెట్టిన బీజేపీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశంపై సందిగ్ధత నెలకొంది. త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించాలని భావించారు. అగ్రనేతల వరుస టూర్లు, సభలను సక్సెస్ చేయడంపై ఇందులో చర్చించాలని అనుకున్నారు. కానీ అదే రోజున ప్రధాని మోడీ సభ ఉండటంతో ఈ సమావేశం వా యిదా పడే అవకాశముంది.

ప్రధాని సభ ఏర్పాట్ల పరిశీలన

దిశ బ్యూరో, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలో వచ్చే నెల 1న బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విజయ్ సంకల్ప యాత్రకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి తెలిపారు. శనివారం భూత్పూర్ మున్సిపాలిటీ అమిస్తాపూర్‌లో స్థలాన్ని జితేందర్ రెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా బీజేపీ నేతలు పరిశీలించారు. భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Read More: అక్టోబర్‌లో టీ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా.. ఎవరెవరి పేర్లు ఉంటాయంటే..?



Next Story

Most Viewed