B.V. Pattabhiram : ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ కన్నుమూత

by Muthe.Rajitha |   (  Updated:2025-07-01 12:32:55  IST  )

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్(B.V. Pattabhiram) కన్నుమూశారు.

B.V. Pattabhiram : ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డా. బీవీ పట్టాభిరామ్(B.V. Pattabhiram) కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సోమవారం అర్థరాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించినట్టు సమాచారం. మానసిక వైద్యుడిగా, ఇంద్రజాలికుడిగా, రచయితగా ఆయన ప్రసిద్ధి చెందారు. తెలుగు. ఇంగ్లీష్, కన్నడ, తమిళ భాషల్లో పట్టాభిరామ్ రాసిన పుస్తకాలు బాగా ఫేమస్ అయ్యాయి. అలాగే విద్యార్థుల కోసం తెలుగు రాష్ట్రాల్లో వేలాది పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు నిర్వహించారు. కాగా రేపు మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ‘రావ్ సాహెబ్’ భావరాజు సత్యనారాయణ సంతానంలోని 15 మందిలో బీవీ పట్టాభిరామ్‌ ఒకరు. కాకినాడలో ఉన్నత విద్య చదువుతున్న రోజుల్లో ఎంబేర్‌ రావు అనే ఇంద్రజాలికుడి నుంచి ఆ విద్యను నేర్చుకుని.. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఆహార సంస్థలో ఉద్యోగం చేసే రోజుల్లోనూ సాధన చేసి.. 1970 దశకం నాటికి ఇండిపెండెంట్ గా రెండుమూడు గంటల పాటు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఇంద్రజాలం ప్రదర్శించే స్థాయికి బీవీ పట్టాభిరామ్‌ ఎదిగారు. దాదాపు అర్థ శతాబ్దం పాటు ఆయన ఇంద్రజాలికుడిగా, సైకాలజీస్టుగా సమాజానికి సేవలందించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సైకాలజీ, ఫిలాసఫీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. అలాగే ఇదే యూనివర్సిటీ నుంచి యోగా, హిప్నోటిజనంలో పీహెచ్‌డీ చేశారు. భారత ఆహార సంస్థలో ఆయన ఉద్యోగిగా విధులు నిర్వహించారు. పలు పురస్కారాలను సైతం ఆయన అందుకున్నారు.

Next Story