పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మార్పు! మాదిగలకు టికెట్?..కండియం ఎంట్రీతో మారుతున్న ఈక్వేషన్స్

by Disha Web Desk 13 |
పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మార్పు! మాదిగలకు టికెట్?..కండియం ఎంట్రీతో మారుతున్న ఈక్వేషన్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితాలో కీలక మార్పులు జరగబోతున్నట్టు తెలుస్తోంది.మాల, మాదిగ ఈక్వేషన్‌తో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని మార్చే యోచనలో ఏఐసీసీ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఉన్న మూడు ఎస్సీ రిజర్వుడ్ లోక్ సభ స్థానాల్లో రెండుచోట్ల మాలలకే అవకాశం కల్పించారు. దీంతో రాష్ట్రంలో 80 లక్షల జనాభా కలిగిన తమకు లోక్ సభ అభ్యర్థులలో ప్రయార్టీ ఇవ్వకపోవడంపై మాదిగ సామాజిక వర్గం మండిపడుతోంది. అనూహ్యంగా కడియం శ్రీహరి చేరిక నిర్ణయంతో మాదిగలకు ఒక్కసీటైనా దక్కుతుందా? అధిష్టానం ఏం ఆలోచన చేస్తుందనేది ఆసక్తిని రేపుతోంది.

కడియం రాకతో మారనున్న సమీకరణాలు?

పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి మార్పు ఖాయం అనే చర్చ తెరపైకి వస్తోంది. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎంపీ టికెట్ హామీ మేరకే కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న చర్చ సాగుతుండటం, పార్టీ సైతం ఆ స్థానాన్ని పెండింగ్‌లో ఉంచడంతో కడియం కుటుంబానికే టికెట్ ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే రాష్ట్రంలో నాగర్‌కర్నూల్‌ మల్లురవి (మాల), పెద్దపల్లి గడ్డం వంశీ(మాల), వరంగల్ కడియం కుటంబం (మాల) సామాజిక వర్గాలకే టికెట్లు దక్కినట్లు అవుతుంది. దీంతో మాదిగల నుంచి ఊహించని వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కచోట మాదిగలకు అవకాశం కల్పించేందుకు పెద్దపల్లి అభ్యర్థి గడ్డం వంశీని మార్చి ఆ స్థానంలో మాదిగ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చ పొలిటికల్ కారిడార్‌లో వినిపిస్తోంది.

వంశీపై పెద్దపల్లి కాంగ్రెస్‌లో గుస్సా...

ఇప్పటికే గడ్డం కుటుంబం నుంచి చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వినోద్ ఉండగా తాజాగా పెద్దపల్లి ఎంపీ టికెట్ సైతం అదే కుటుంబానికి చెందిన వంశీకి కేటాయించడం పట్ల పెద్దపల్లి కాంగ్రెస్‌లో రచ్చ జరుగుతోంది. ఒకే కుటుంబానికి మూడు పదవులు ఇస్తే దశాబ్దాలుగా పార్టీ జెండాను మోస్తున్న తమ పరిస్థితి ఏంటని? ఆశావహులు నిలదీస్తున్నారు. అలాగే సెగ్మెంట్ పరిధిలోని మెజార్టీ ఎమ్మెల్యేలు వంశీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు వంశీ అభ్యర్థిత్వం విషయంలో ఆలోచన చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లగా, తమ వర్గానికి అవకాశం కల్పించాలని పిడమర్తి రవి, గజ్జెల కాంతం, సంపత్ తదితర మాదిగ సామాజిక నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో వంశీ స్థానంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓ ఎన్ఆర్ఐని బరిలోకి దింపాలని ఏఐసీసీ రంగం సిద్ధం చేస్తోందని తెలుస్తోంది.


Next Story