ప్రభుత్వంపై 'ముప్పేట దాడి'.. రసవత్తరంగా అసెంబ్లీ సమావేశాలు?

by Disha Web Desk 2 |
ప్రభుత్వంపై ముప్పేట దాడి.. రసవత్తరంగా అసెంబ్లీ సమావేశాలు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: నేటి నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ముప్పేట దాడిచేసేందుకు ప్రతిపక్షాలు సర్వం సిద్ధమయ్యాయి. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించేలా ప్లాన్ చేశాయి. ప్రధానంగా ఎనిమిదేళ్లుగా నెరవేర్చని హామీలపైనే ప్రశ్నించనున్నారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, వరి కొనుగోళ్లు, దళితబంధు, తాగు, సాటు నీటి ప్రాజెక్టుల కట్టడాల్లో లోపాలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు, ఫీజు రియింబర్స్ మెంట్, ఎస్సీ, ఎస్టీ స్కీంల అమలు తీరు, సర్కార్ దవాఖాన్లలోని సమస్యలు, ఆరోగ్య శ్రీ ఫెండింగ్ బిల్లులు, కరోనా బాధితుల నష్ట పరిహారం, దళితబంధు, లా అండ్​ ఆర్డర్, తదితర అంశాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఇటు బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు ఇవే అంశాలతో సర్కార్‌ను నిలదీయనున్నారు. దీంతో పాటు ఇటీవల 317 జీవోతో వచ్చిన సమస్యలపై కూడా ఇరు పార్టీలు అసెంబ్లీలో ప్రస్తవించనున్నట్లు ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇప్పటికే సభలో వ్యవహరించాల్సిన తీరు, అమలు చేయాల్సిన స్కెచ్, ప్రశ్నించాల్సిన అంశాలపై రెండు జాతీయ పార్టీలు ఆదివారం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ బెదిరింపులకు భయపడకుండా సమస్యలను సూటిగా నిలదీయనున్నారు. అయితే ప్రతిపక్షాలకు ఊహించిన విధంగా స్పీకర్ సమయం ఇస్తారా? లేదా? అనేది మాత్రం ప్రశ్నర్ధకంగా మారింది.

గవర్నర్​ఇష్యునూ..

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఇరు పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు కురిపించనున్నాయి. దీంతో పాటు గతేడాది అక్టోబరులో సమావేశాలు ముగిసినా ఇప్పటివరకు సభను ప్రోరోగ్ చేయకపోవడం కారణాలను సభ నుంచి రాబట్టేలా ప్రశ్నలు అడగనున్నారు.

గడిచిన సెషన్స్‌లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా గడిచిన సెషన్స్‌లో సర్కార్ ఇచ్చిన హామీలపై ఫైర్ కానుంది. అప్పట్లో ఫ్లోర్ లీడర్, సభ్యులు లేవనెత్తిన సమస్యలు ఎంత వరకు పరిష్కారం అయ్యాయి? ఆలస్యం కావడానికి కారణాలను సభ పూర్వకంగా తీసుకోవాలనుకుంటున్నది. ఈ మేరకు గడిచిన సెషన్స్‌లో కాంగ్రెస్​పార్టీ లేవనెత్తిన అంశాల జాబితా, ప్రస్తుత పరిస్థితులు వంటి వాటిపై పార్టీ క్షేత్రస్థాయి నుంచి ప్రత్యేక రిపోర్టు తెప్పించుకున్నట్లు పార్టీ ముఖ్య నేతలు పేర్కొంటున్నారు.

బీజేపీ నుంచి ఈటల.. కాంగ్రెస్ నుంచి భట్టి

ఈ సారి బడ్జెట్ సెషన్స్ ఆసక్తికరంగా మారబోతున్నాయి. గతంలో మంత్రి హోదాలో అసెంబ్లీలోకి వెళ్లిన ఈటల ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ప్రత్యక్షం కానున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ఆలోచన విధానం, అమలు తీరు, హామీల నేరవేర్చడం వంటి విషయాల్లో మిగతా వాళ్లతో పోల్చితే ఆయనకు స్పష్టంగా అవగాహన ఉన్నది. దీంతో ఈ సారి ఈటలతోనే ప్రభుత్వంపై దాడి చేయించాలని బీజేపీ ప్లాన్ చేసింది. పైగా బీసీ నేత కావడంతో ప్రజల్లో పార్టీకి మద్ధతు పెరుగుతందని బీజేపీ భావిస్తున్నది. ఇక కాంగ్రెస్ నుంచి ఫ్లోర్ లీడర్ భట్టి, ఎమ్మెల్యే సీతక్కలూ ప్రభుత్వంపై విరుచుపడేందుకు రెడీ అయ్యారు. రెండు పార్టీలు ముకుమ్మడిగా సమస్యలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఊపీరి అడకుండా చేయాలనే లక్ష్యంతో అసెంబ్లీ సెషన్స్​జరగనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed