రాజకీయంగా సీఎం కేసీఆర్ ను కొట్టాలంటే మరో కేసీఆరే పుట్టాలి

by Disha Web Desk 15 |
రాజకీయంగా సీఎం కేసీఆర్ ను కొట్టాలంటే మరో కేసీఆరే పుట్టాలి
X

దిశ, నవీపేట్ : సీఎం కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలతో మరోసారి కేసీఆర్ సర్కారు ఏర్పడుతుందని, కేసీఆర్ ను ఓడించాలంటే మరో కేసీఆరే పుట్టాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం రాత్రి బోధన్ నిజాం షుగర్స్ మైదానంలో జరిగిన యువ గర్జన బహిరంగ సభలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. అంతకుముందు ఆచంపల్లి నుంచి కవితకు భారీ ర్యాలీ బాణా సంచాల మధ్య యువకులు ఆహ్వానం పలికారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ తెలంగాణ లో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదని, మరోసారి తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని అన్నారు. యువకులు పోలింగ్ శాతం పెంచాలని కోరారు. ఉద్యమ స్ఫూర్తి తో ఇంటింటికి వెళ్లి గుండె గుండెను కదిలించి కారు గుర్తుకు ఓటు వేసేలా యువత పని చేయాలని కోరారు. ఎమ్మెల్యే షకీల్ ప్రజల కోసం పనిచేసే నాయకుడని ఆమె అన్నారు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని మూడవ పర్యాయం తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆమె అన్నారు. బోధన్ నియోజకవర్గ ప్రజలు యువకులు ఎమ్మెల్యే షకీల్ ను 50 వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే షకీల్ పరితపించే వ్యక్తి అని నిధుల కోసం మంత్రులు సీఎం వద్దకు తనను తీసుకొని వెళ్లారని, గతంలో ఎన్నడూ జరగని

అభివృద్ధిని ఆయన చేశారని కవిత గుర్తు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేనప్పటికీ సొంత గ్రామం సిరన్ పల్లి ని బోధన్ నియోజకవర్గం ను అభివృద్ధి చెయ్యలేదని, జలయజ్ఞం ను ధనయజ్ఞం గా మార్చుకున్నారని విమర్శించారు. సుదర్శన్ రెడ్డి సొంత ఊరు సిరన్ పల్లి అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఏడు కోట్ల రూపాయలను కేటాయించిందని, బీజేపీ అభ్యర్థి మోహన్ రెడ్డి స్వగ్రామం మొకన్ పల్లి అభివృద్ధికి 15 కోట్ల రూపాయలు కేటాయించామని గుర్తు చేశారు. తమకు రాజకీయాలు ముఖ్యం కాదని గ్రామాల అభివృద్ధి ముఖ్యమని కవిత చెప్పుకొచ్చారు. ఎన్నికలవేళ వచ్చే నేతలు ఎన్నో విషయాలు మాట్లాడతారని వాటిని ప్రజలు పట్టించుకోవద్దన్నారు. నీళ్లు,నిధులు, నియామకాలు అనే నినాదాన్ని తాము పూర్తి చేశామని కవిత అన్నారు. అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని ఎమ్మెల్యే షకీల్ ను మూడో పర్యాయం గెలిపించే బాధ్యత యువకులు తీసుకోవాలన్నారు. ఉద్యోగాల కల్పన పై రేవంత్ రెడ్డి కి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు.

2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కలిపి కేవలం 24 వేల ఉద్యోగాలు మాత్రమే కల్పించిందని, అందులో తెలంగాణకు వచ్చిన ఉద్యోగాలు కేవలం 10 వేలు మాత్రమేనని వివరించారు. ఆ 10 వేలు కూడా తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాము కాబట్టి చివరి రెండేళ్లు మాత్రమే ఆ ఉద్యోగాలు ఇచ్చారని, అంటే కాంగ్రెస్ పాలనలో ఏటా సగటున వెయ్యి ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో అలా ఉంటే గత పదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని, అందులో 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసుకున్నామని స్పష్టం చేశారు. మరో 40 వేల ఉద్యోగాల భర్తీ ఆయా దశల్లో ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయగానే, పరీక్షలు పెట్టగానే, ఫలితాలు వెల్లడించగానే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కోర్టుల్లో కేసులు

వేయడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు, యువతకు కలిగే ప్రయోజనాలను దొంగదారిలో అడ్డదారిలో ఆపాలని ప్రయత్నం చేయడం తప్పా కాంగ్రెస్ పార్టీ మంచి చేయడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ మారాలంటే యువత మారాలని, మార్పు యువత నుంచే రావాలని అన్నారు. రైతు బంధు, ఆసరా పెన్షన్లు, బీడీ కార్మికులకు పెన్షన్లు. షాద ముబారక్, కళ్యాణ లక్ష్మీ వంటివి కావాలని ఎవరైనా కేసీఆర్ ను అడిగారా కానీ ఇవన్నీ ఎందుకు చేశారు అని ప్రశ్నించారు. తెలంగాణపై ప్రేమ ఉంది కాబట్టే సీఎం కేసీఆర్ ఇవన్నీ చేయగలిగారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షకీల్, ఆయేషా ఫాతిమా, బీఆర్ఎస్ నాయకులు గంగారెడ్డి, రవీందర్ యాదవ్, వెంకటేశ్వరరావు, దేశాయ్, సోహైల్ అమీర్, బెంజర్ గంగారం, యువజన విభాగం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed