కామారెడ్డి నూతన సబ్ రిజిస్ట్రార్ గా ప్రవీణ్.. పంతం నెగ్గించుకున్న బీఆర్ఎస్ లీడర్లు

by Disha Web Desk 1 |
కామారెడ్డి నూతన సబ్ రిజిస్ట్రార్ గా ప్రవీణ్.. పంతం నెగ్గించుకున్న బీఆర్ఎస్ లీడర్లు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలోని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్ మెంట్ లో కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ గా పని చేస్తున్న శ్రీలతకు డిప్యూటేషన్ ఇస్తూ నిజామాబాద్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ జి.మధుసుదన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ గా పని చేస్తున్న శ్రీలతను నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఎంవీ అండ్ ఆడిట్ కార్యాలయానికి డిప్యూటేషన్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

ఆమె స్థానంలో నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ (ఇన్ చార్జి సబ్ రిజిస్ట్రార్) బారడ్ ప్రవీణ్ కుమార్ కు పోస్టింగ్ ఇస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. 317 జీవో కింద కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ గా జి.శ్రీలత గతేడాది విధుల్లో చేరారు. విధుల్లో చేరిన తర్వాత అక్కడ అధికార పార్టీ నేతలకు, సబ్ రిజిస్ట్రార్ కు మధ్య రిజిస్ట్రేషన్ల విషయంలో విబేధాలు తలెత్తాయి. కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా కేంద్రంలో లేఅవుట్ లేకుండానే చాలా వెంచర్లు వెలిశాయి. దీంతో పాటు అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల ఎన్వోసీలు రాకుండానే రిజిస్ట్రేషన్ల కోసం ప్రయత్నాలు చేశారు.

2019లో మున్సిపల్ చట్టం సెల్ఫ్ అసిస్ మెంట్ ఆధారంగా రిజిస్ట్రేషన్లకు ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రభుత్వం సెల్ఫ్ అసిస్ మెంట్ ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ విషయంలో సబ్ రిజిస్ట్రార్ రాజీ పడలేదు. దీంతో కామారెడ్డికి చెందిన రియల్ వ్యాపారులు తమ పప్పులు ఉడకడం లేదని అధికార పార్టీ నేతలను కలుపుకుని రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆమె వెనక్కి తగ్గకపోవడంతో ఏకంగా సబ్ రిజిస్ట్రార్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ ఆమెను తొలగించాలని డిమాండ్ చేశారు.

అందుకోసం ప్రత్యేకంగా కామారెడ్డి జేఏసీని ఏర్పాటు చేశారు. మార్చి మొదటి వారంలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. డాక్యుమెంట్ రైటర్లతో కలిసి మార్చిలో జరిగిన మున్సిపల్ బడ్జెట్ సమావేశాల్లో వీఎల్టీలపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లతో కలిసి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. 8 రోజుల పాటు డాక్యుమెంట్లు చేయకుండా నిరసనలు తెలిపారు. కానీ, సబ్ రిజిస్ట్రార్ పై అవినీతి, ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆమెను బదిలీ చేయలేదు. దీంతో కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ గా పని చేస్తున్న శ్రీలతను బదిలీ చేసేందుకు అధికార పార్టీ నేతలు ఛాలెంజ్ గా తీసుకున్నారు.

ఈ విషయంలో కామారెడ్డి బీఆర్ఎస్ అగ్రనేతతో పాటు రియల్ దందాలో ఉన్న ప్రముఖులు కీలక పాత్ర పోషించారు. సబ్ రిజిస్ట్రార్ ను తొలగించాలని ఏకంగా హైదరాబాద్ లోనే తిష్ట వేశారు. కామారెడ్డికి చెందిన ప్రజాప్రతినిధితో పాటు మరో ప్రజాప్రతినిధి బంధువు కూడా చక్రం తిప్పారు. శ్రీలతపై వేటు వేయకపోయినా పరవాలేదు కానీ, కామారెడ్డి నుంచి బదిలీ చేయాలంటూ సదరు నేతలు పట్టుబట్టారు. కామారెడ్డి జిల్లాలో తాను ఎక్కడ సబ్ రిజిస్ట్రార్ గా పని చేసినా తమకు ఇబ్బందిగానే ఉంటుందని గ్రహించి నిజామాబాద్ జిల్లాకు శ్రీలతకు డిప్యూటేషన్ వేయించడం వారు సఫలమయ్యారు.

అదే సమయంలో కామారెడ్డిలో తాము ఆడిందే ఆటగా, కావాలంటే తాము చెప్పిందే వినేవారు కావాలని రెగ్యులర్ రిజిస్ట్రార్ స్థానంలో సీనియర్ అసిస్టెంట్ ను నియమింపజేశారని జోరుగా చర్చ జరుగుతోంది. అవినీతి, అక్రమాలను సహించని నీతి, నిజాయితీ గల అధికారులను అధికార పార్టీ నేతలు పగబట్టి బదిలీ లేదా డిప్యూటేషన్ పేరుతో పంపిస్తున్నారనడానికి సబ్ రిజిస్ట్రార్ శ్రీలత ఉదంతమే ఇందుకు ఉదాహరణ అని ఉద్యోగ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.



Next Story

Most Viewed