ఎన్నికల వేళ కామారెడ్డిలో కుల సంఘాలకు పార్టీల ఆఫర్లు

by Disha Web Desk 12 |
ఎన్నికల వేళ కామారెడ్డిలో కుల సంఘాలకు పార్టీల ఆఫర్లు
X

దిశ, భిక్కనూరు: ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు యాక్టివయ్యాయి. కుల సంఘాల మద్దతు కూడగట్టుకునేందుకు పోటాపోటీగా ఆఫర్లిస్తున్నాయి. కుల సంఘాల భవన నిర్మాణాల కోసం ఇప్పటికే అధికార పార్టీ విడతల వారీగా నిధులు మంజూరు చేస్తుండగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ మాత్రం పిల్లర్ల వరకు కట్టుకుంటే తామే స్వయంగా వచ్చి స్లాబ్ వేస్తామని, చెబుతుండగా, కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులిస్థామని, కావాలంటే అడ్వాన్స్‌గా లక్షో రెండు లక్షలో ఇస్తామని అప్పటి వరకు వీటితో సగబెట్టుకోవాలని చెబుతున్నారు. గుళ్ళు గోపురాల వద్ద నీటి కటకట ఉంటే ఎద్దడి తీర్చేందుకు బోర్ వేయించి, మోటార్లు కూడా బిగిస్తున్నారు. అయినా సమస్య పరిష్కారం కాని పక్షంలో ఖర్చుకు వెనుకాడకుండా అవసరమైన పైప్ లైన్లను కూడా వేయిస్తున్నారు.

ఇలా ఒకరిని చూసి ఒకరు, సంఘాలు, గుళ్లకు జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, పోటీ చేసే అభ్యర్థులను కలుస్తూ అనుకున్న పనులకు నిధులు మంజూరు చేయించుకుంటున్నారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోని దాదాపు అన్ని కుల సంఘాల ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు పోటాపోటీగా తాయిలాలు ప్రకటిస్తున్నాయి.భవన నిర్మాణాలకు నిధులే కాకుండా, ఎవరికి ఏ ఆపద వచ్చినా.. అనారోగ్య సమస్యలు తలెత్తి, ఆసుపత్రిలో చేరిన వారిని వద్దకు వెళ్లి పలకరించి వస్తున్నారు. పైగా వైద్య ఖర్చుల కోసం ఆయా పార్టీల నేతలు ఎంతో కొంత నగదు ముట్టజెప్పి వస్తున్నారు.

ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వారి ఇండ్లకు వెళ్లి పరామర్శించి, బాధలో ఉన్న వారిని ఓదార్చి, సంతాపం తెలియజేస్తున్నాను. కుటుంబ పెద్దలను కోల్పోయి, అనాధలుగా మారిన ఆయా కుటుంబాల సభ్యులను అక్కున చేర్చుకొని అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించి మేమున్నామంటూ భరోసా నివ్వడమే కాకుండా, కొందరు నిరుపేద ఆడపిల్లల పెండ్లిలకు పుస్తె మట్టెలను కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా అన్న ఖర్చును కూడా పెడుతున్నారు. పలు గ్రామాల్లో కొన్ని కుటుంబాల పోషణను తమ భుజస్కందాలపై వేసుకొని నెలనెలా ఖర్చులకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ విధంగా ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలకు చెందిన నేతలు ఇప్పటి నుంచే ఓటర్లకు గాలం వేసే పనిలో నిమగ్నమయ్యారు.


Next Story