వివాదాస్పద భూముల కుంభకోణం పై జాతీయ పార్టీనేత కీలక వ్యాఖ్యలు..

by Disha Web Desk 20 |
వివాదాస్పద భూముల కుంభకోణం పై జాతీయ పార్టీనేత కీలక వ్యాఖ్యలు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరానికి చెందిన ఓ జాతీయ పార్టీ నాయకుడు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఎందుకంటే రాష్ట్ర మంత్రి ఆదేశాలతో జిల్లా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం నకిలీ పట్టాలు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో వందల కోట్ల భూములపై విచారణ జరుగుతుండగానే జాతీయ నాయకుడు మాట్లాడిన 1.7 నిమిషాల నిడివి గల వీడియో హల్ చల్ చేస్తోంది. సంబంధిత లీడర్ తన అనుచరులైన అంబర్ సింగ్, మరో వ్యక్తి కలిసి దుబ్బాలోని భూమిని డాక్యుమెంటేషన్ కరెక్ట్ గానే చేశారని ఆ వీడియోలో పేర్కొన్నారు.

ఎక్కడో విభేదాలు వచ్చి దుబ్బాలోని కోట్ల రూపాయల భూమి వ్యవహరం బహిర్గతమైందన్నారు. అదే విధంగా ఎమ్మెల్సీ కవిత ఇంటి ఎదుట భూమికి సైతం ఎసరు పెట్టారని కానీ అక్కడ ఒర్జినల్ పట్టాదారులు రావడంతో ఈ వ్యవహరం సెట్ చేయడం కుదురలేదని వ్యాఖ్యానించడం విశేషం. దుబ్బాలోని వారసులు లేని వివాదాస్పద భూమిని వారసులను క్రియేట్ చేసి సెట్ చేసిన డాక్యుమెంట్ వ్యవహరంలో చాలామంది పెద్దల హస్తం ఉందని ఆ వీడియోలో సదరు నేత పేర్కొన్నారు. అంతేగాకుండా సంబంధిత భూమిని పెద్ద పోలీసు అధికారులకే అంటగట్టిన వ్యాఖ్యలు సంబంధిత వీడియోలో ఉండడం కలకలం రేపుతుంది. ఇప్పుడు ఆ వీడియోలో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తుంది.

నిజామాబాద్ నగరంలో రెండు రోజులుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పరిశోదనలో వెలుగుచూస్తున్న వందల కోట్ల వివాదాస్పద భూముల హాంఫట్ పై ఒక నాయకుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సంబంధిత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిజామాబాద్ నగరంలో వివాదాస్పద భూములు, ప్రభుత్వ భూములు ఎమ్మార్వో సంతకాలు ఫోర్జరీ చేసి పట్టా భూములుగా, ప్రైవేట్ భూములుగా చేసే ముఠాను పోలీసులు పట్టుకున్న విషయం తెల్సిందే. అందులో ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఇద్దరు దళారులు, ఓ మీసేవా కేంద్ర నిర్వాహకుడు, ఓ డీటీపీ ఆపరేటర్ నిర్వాహకుడు పట్టుకున్న విషయం విధితమే. వారి ద్వారా నగరంలో గత దశాబ్ధ కాలంగా జరిగిన ఫోర్జరీ డాక్యుమెంట్ల వ్యవహరాన్ని తేల్చే పనిలో పడ్డారు. ఓ వైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారణ జరుపుతుండగానే అందులో వారికి చిక్కిన ఒకరిద్దరు పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయం నుంచి నిజామాబాద్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండాపోయింది. వివాదాల్లో ఉన్నభూముల విషయంలో తలదూర్చడం, సెట్ చేయడమే ఒక గ్యాంగ్ పనిగా పెట్టుకుంది. ఇద్దరు ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను, ఒక టీచర్ ను రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టించి లిటిగేషన్ భూములను అమ్మడం పనిగా జరుగుతుంది. ఈ వ్యవహరంలో నాగారాం వద్ద ఉన్న 2 వేల గజాల 1888 సర్వే నంబర్ లోని భూమికోసం విభేదాలే బహిర్గతం చేశాయని చెప్పాలి. కొంత కాలం క్రితం నిజామాబాద్ సౌత్ ఎమ్మార్వో కార్యాలయంలో పని చేసిన డీటీ ఒకరు అదేవిధంగా అక్కడ పని చేసిన సర్వేయర్ కూడా ముఠాకు సహకరించినట్లు సమాచారం.

నిజామాబాద్ సరస్వతి నగర్ లోని ఒక డీటీపీ ఆపరేటర్ కు, గుర్భాబాధి రోడ్డులోని మీసేవా కేంద్రం నిర్వాహకుడు వీళ్లకు సహకరించి ప్రభుత్వ భూములు లిటిగేషన్ భూముల తయారిలో కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. కరెంట్ శాఖలో పనిచేసే ఉద్యోగి ఒకరు ఎమ్మార్వో సంతకాలను ఉన్నది ఉన్నట్లుగా సంతకాలు ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. వీరి వెనుక ఒక జాతీయ పార్టీ నాయకుడు ఉన్నాడనేది అందరికీ తెలిసిందే. దాంతో పాటు కొందరు దళారులు అధిక పార్టీ నేతలను ముందుపెట్టి దుబ్బా, బైపాస్ రోడ్డు, గంగాస్తాన్ రోడ్డు, కాలూర్, ఖానాపూర్, కంఠేశ్వర్ ప్రాంతాల్లోని కోట్ల విలువైన భూములను కొట్టేసినట్లు సమాచారం. ఈ గ్యాంగ్ ఒక్కటే కాకుండా మరికొందరు కలిసి బినామీలుగా నగరం చుట్టురా వందల కోట్ల భూములను కొట్టేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్లు గుర్తించారు. రిజిస్ట్రేషన్ శాఖలో గతంలో సస్పెండ్ అయిన సబ్ రిజిస్ట్రార్ల ద్వారానే ఈ తతంగం నడిపినట్లు సమాచారం. టాస్క్ ఫోర్స్ విచారణను దారి మళ్లించేందుకు యత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed