"నమస్తే నవనాధపురం" కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

by Dishanational1 |
నమస్తే నవనాధపురం కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
X

దిశ, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా వంజరి సంఘానికి ప్రత్యేకంగా నిర్మిస్తున్న కల్యాణ మండపం నిర్మాణం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి జనవరి 26న ప్రారంభోత్సవం చేస్తామని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి వెల్లడించారు. "నమస్తే నవనాధపురం" కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదివారం మాక్లూర్ మండలంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఉదయమే అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి అడివి మామిడిపల్లి గ్రామం చేరుకున్న జీవన్ రెడ్డికి గ్రామ ప్రజలు, వంజరి సంఘం ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వంజరి సంఘం సభ్యులు, గ్రామ ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని శాలువాలు, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. జై జీవనన్న, జై తెలంగాణ, దేశ్ కీ నేత కేసీఆర్ అని నినదించారు.

కాగా, అక్కడ నిర్మిస్తున్న వంజరి సంఘం కల్యాణ మండపం నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. కల్యాణ మండపానికి సంబంధించిన వివిధ పనులకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేషనల్ హైవే సమీపంలో రెండున్నరెకరాల స్థలంలో నిర్మిస్తున్న వంజరి సంఘం కళ్యాణ మండపం పనులకు ఇప్పటికే 70 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. అవసరమైతే ఈ కల్యాణ మండపానికి ఎన్ని నిధులైన ఇస్తానని చెప్పారు. మిగిలి ఉన్న పనులు పూర్తి చేయడానికి రూ. 35లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించిన జీవన్ రెడ్డి అందుకు సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలను వంజరి సంఘం ప్రతినిధులకు అందజేశారు.

మిగిలి ఉన్న పనులను 13 విభాగాలుగా విభజన చేసి సంఘ సభ్యులకు బాధ్యతలు అప్పగించామన్నారు. వీడీఎఫ్, రేకుల షెడ్డు, సీసీ రోడ్లు, గార్డెన్, వాటర్ ట్యాంక్, కాంపౌండ్ వాల్, వాషింగ్ ఏరియా, బాత్ రూముల నిర్మాణం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి కల్యాణ మండపాన్ని జనవరి15 నాటికెల్లా వంజరి సంఘానికి అప్పగిస్తామని జీవన్ రెడ్డి తెలిపారు. జనవరి 26న ఈ కల్యాణ మండపంలో మొట్టమొదటి వివాహం జరుగుతుందని ఆయన వెల్లడించారు. మెయిన్ రోడ్డు నుంచి కల్యాణ మండపం వరకు తారు రోడ్డు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. జనవరి 26 నుంచి వంజరి సంఘం సోదరులకు ఈ కల్యాణ మండపాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు. పెళ్లి భారం ఉండకూడదన్న భావనతోనే సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మీ పథకాన్ని అమలులోకి తేవడమే కాకుండా అన్ని వర్గాల వారు ఉచితంగా పెళ్లిండ్లు జరుపుకునేలా కల్యాణ మండపాల నిర్మాణాలకు అంకురార్పణ చేశారని తెలిపారు. ఈ కల్యాణ మండపం నిజామాబాద్ జిల్లాలోని 20 వేల మంది వంజరి సంఘం సోదరులకు ఉపయోగకరమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నమస్తే నవనాధపురం కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు, ప్రజా ప్రతినిధులకు జీవన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాక్లూర్ మండల పరిషత్ అధ్యక్షుడు మాస్త ప్రభాకర్, సర్పంచ్ మల్లారెడ్డి, వంజరి సంఘం ఫంక్షన్ హాలు నిర్మాణ కమిటీ సభ్యులు భూమన్న, రాజు, రవీంద్ర, నగేష్, గొట్టెముక్కల గంగన్న, భూమేష్, దుమ్మాజీ శ్రీనివాస్, సీ.హెచ్ కొండూరు రాజు, సీనియర్ నాయకులు గోవర్ధన్, భూషణ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed