60 ఏళ్ల సాగు నీటి గోసను తీర్చిన నాయకుడు కేసీఆర్ : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

by Disha Web Desk 1 |
60 ఏళ్ల సాగు నీటి గోసను తీర్చిన నాయకుడు కేసీఆర్ : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
X

దిశ, భీమ్‌గల్ : 60 ఏళ్ల సాగు నీటి గోసను తీర్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండలం ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ జీరో పాయింట్ పంప్ హౌస్ వద్ద తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిగిన సాగునీటి దినోత్సవంలో మంత్రి వేముల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాడు సమైక్య పాలనలో ఎండిన బోర్లు, బీడు భూములు ఎక్కిరెంచేవని.. నేడు చెరువులు, కుంటలు, బోరు బావులు, కాలువలు ఫుల్లుగా నీళ్లతో కళకళలాడుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

తలాపున పారుతుంది గోదారి, మన చేను.. మన చెలుక ఎడారి అని నాడు పాటలు పడుకున్నామని మంత్రి గుర్తు చేశారు. కానీ, నేడు చెరువులు, చెక్ డ్యాంలు, కాలువలు, రిజర్వాయర్లు మండుటెండల్లో నిండుగా ఉన్న నీళ్లతో రైతులంతా సంబురంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇదంతా ఊరికే కాలేదని సీఎం కేసీఆర్ నిర్విరామ కృషి, అకుంఠిత దీక్ష వల్లే సాధ్యమైందన్నారు. దీంతో పంటలు ఫుల్లుగా పండుతున్నాయని తెలిపారు. ఎస్సాఎస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా 310 కి.మీ పైకి 200 కి.మీ సొరంగాల ద్వారా 1,531 కి.మీ కాల్వల ద్వారా 16 రిజర్వాయర్లు ద్వారా వచ్చిన కాళేశ్వరం జలాలు పంప్ చేసుకొని పోచంపాడు ప్రాజెక్టు నింపుకుంటున్నమని తెలిపారు.

అక్కడి నుంచి లిఫ్టులు, కెనాల్స్ ద్వారా ఊరూరా చెరువులు కుంటలు నింపుకుంటున్నామని వివరించారు. మండుటెండల్లో చెరువులు అలుగులు పారుతున్నయంటే సీఎం కేసిఆర్ చొరవే అని మంత్రి పేర్కొన్నారు. గోదావరిలో వృథాగా పోతున్న నీటిని కాళేశ్వరం వద్ద ఒడిసి పట్టి అక్కడి నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువ గుండా ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నింపుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఈ రోజు ముప్కాల్ పంప్ హౌస్ జీరో పాయింట్ వద్ద విజయోత్సవ సభ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ముప్కాల్ పంప్ హౌస్ కోసం రూ.610 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో గుత్ప లిఫ్ట్, బోదేపల్లి లిఫ్ట్, నాగపూర్ లిఫ్ట్, జలాల్పూర్ లిఫ్ట్, చౌట్పల్లి హన్మంతు రెడ్డి లిఫ్ట్, ఏర్గట్ల గుమ్మిర్యాల లిఫ్ట్ ద్వారా ప్రతి మండలంలో ఊరూరా చెరువులు నింపుకుంటున్నమని వివరించారు.

ప్యాకేజీ 21 ద్వారా భీమ్‌గల్, వేల్పూర్, కమ్మర్ పల్లి, మోర్తాడ్ మండలాలకు సుమారు 80వేల ఎకరాలకు సాగునీరందించే ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సుమారు రూ.100 కోట్లకు పైగా ఖర్చుతో పెద్ద వాగు కప్పల వాగు మీద 24 చెక్ డ్యాంలు ఏర్పాటు చేసుకున్నామని వాటితో బోర్లు రీ జనరెట్ అయ్యాయని, దాదాపుగా 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. చిట్టాపూర్ లిఫ్ట్ పురోగతిలో ఉందని వెల్లడించారు. తొమ్మిదేళ్ల క్రితం సాగు నీటి కష్టాలతో మన బతుకులు ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లా మారినయ్ ఒకసారి రైతులు గుండె మీద చేయివేసుకొని ఆలోచన చేయాలని మంత్రి కోరారు.

మండు వేసవిలో కూడా కాకతీయ కాలువ, లక్ష్మి కెనాల్, వరద కాలువ నీటితో నిండుగా ఉన్నాయని తెలిపారు. ప్రతిపక్షాలు మాటలు విని మోస పోతే మల్లా గోసపడేది మనమేనన్నారు. రైతు బాగు కోరే సీఎం కేసీఆర్ కు మనమంతా మద్దతుగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి వేముల రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ సి.ఈ మధుసూదన్ రావు, పలువురు ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, రైతులు, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story

Most Viewed