రాబోయే ఎంపీ ఎన్నికల్లో కవితను భారీ మెజారిటీతో గెలిపించాలి : మంత్రి మల్లారెడ్డి

by Disha Web Desk 1 |
రాబోయే ఎంపీ ఎన్నికల్లో కవితను భారీ మెజారిటీతో గెలిపించాలి : మంత్రి మల్లారెడ్డి
X

గత ఎన్నికల్లో ప్రజలు మోసపోయి ఎంపీగా అరవింద్ ను గెలిపించారు

దిశ ప్రతినిధి, నిజామాబాద్ / ఆర్మూర్: రాబోయే ఎంపీ ఎన్నికల్లో కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. అర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ లో బీఆర్ఎస్ అత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలోని బీడీ కార్మికుల కోసం ఈ.ఎస్.ఐ ఆసుపత్రి మంజూరు చేయించినట్లు ఆయన తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంఘం కోసం కొత్త భవనం ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు.

బీజేపీ దివాలా తీసిన పార్టీ అని, కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసిందేమి లేదన్నారు. నిజామాబాద్ ప్రజలు మోసపోయి నిజామాబాద్ ఎంపీగా అరవింద్ ను గెలిపించారని, కానీ.. ఈసారి జిల్లా ప్రజలు కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 18 రాష్ట్రాలను పాలించిన బీజేపీ, మొన్నటి వరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హాయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ ఉండటం గొప్ప అదృష్టమని, కాంగ్రెస్ హయాంలో చెరువులు ఖబ్జాలకు గురైతే కేసీఆర్ పాలనలో చెరువుల పునరుద్ధరణ జరుగుతోందన్నారు.

జీవన్ రెడ్డిపై పోటీ చేస్తే మైసమ్మ ముందు మేకపోతును కట్టేసినట్టే : ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల లక్ష్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేని మంచి పనులను సీఎం కేసీఆర్ చేసి చూపించారని తెలిపారు. జరిగిన అభివృద్ధిని, అమలవుతోన్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అద్భుతంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గత ఎన్నికల్లో కంటే అధిక మెజారిటీతో వచ్చే ఎన్నికల్లో గెలుస్తారన్న విశ్వాసం ఉందన్నారు.

ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డి మీద ఎవరైనా పోటీ చేయాలనుకుంటే మైసమ్మ ముంగట మేకపోతును కట్టేసినట్టే అవుతుందని తెలియజేశారు. కాబట్టి ఇతర పార్టీల నేతలు గెలిచే అవకాశం లేనందుకు ఆశలు వదిలేసుకుంటే మంచిదని సూచించారు. 1.33 లక్షల మంది బీడీ కార్మికులకు నిజామాబాద్ జిల్లాలో పెన్షన్ అందుతోందని, కాబట్టి ప్రత్యేకించి బీడీ కార్మికుల కోసం ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్మించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లా రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

నా దైవం కేసీఆర్... నా బలం కార్యకర్తలు : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

సీయం కేసీఆరే తన అత్యంత ఇష్ట దైవమని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తనకు వెయ్యి ఏనుగుల బలమని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో ఆర్మూర్ నియోజకవర్గం మొదటి వరుసలో ఉందన్నారు. అభివృద్ధికి అసలైన ఆనవాలుగా ఆర్మూర్ ను నిలిపానని తెలిపారు. రూ.2,500 కోట్లతో ఆర్మూర్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. 62 వేల మందికి పెన్షన్లు, 65 వేల మందికి రైతుబంధు అమలవుతోందని తెలిపారు. మిషన్ కాకతీయ వల్ల చెరువులు కళకళలాడుతున్నామని అన్నారు.

ఇంటింటికీ మిషన్ భగీరధ మంచి నీళ్ల సరఫరా జరుగుతోందన్నారు. చెరువుల్లో మత్స్య సంపద పెరుగుతోందన్నారు. కవితక్క పాత్ర లేని ఆర్మూర్ అభివృద్ధిని ఊహించలేమని, ఆమె ఆశీస్సులతోనే నాకు జీవోల జీవన్ రెడ్డి అనే పేరొచ్చిందని గుర్తు చేశారు. వివిధ కులాల ఫంక్షన్ హాళ్ల నిర్మాణానికి కర్మ, కర్త, క్రియ కవితక్కేనని అన్నారు. ఆర్మూర్ లో మూడోసారి కూడా గెలుపు తనదేనని అన్నారు. నన్ను ఆదరించిన ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల మనసు గొప్పదని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్నా వారి రుణం తీర్చుకోలేనని జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.

ఈ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ చార్జి, శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, టీ.ఎస్.టీ.డబ్ల్యూ.సీ.డీ.సీ చైర్ పర్సన్ ఆకుల లలిత, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, సీనియర్ నాయజిల్లా గ్రంథాలయం చైర్మన్ ఎల్.ఎం.బీ రాజేశ్వర్, రాజారామ్ యాదవ్, కోటపాటి నరసింహ నాయుడు, డాక్టర్ మధుశేఖర్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read..

కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఓట్లు అడిగితే చీపుర్లతో కొట్టాలి: మంత్రి మల్లారెడ్డి ఫైర్

Next Story