ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

by Disha Web Desk 15 |
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును  వినియోగించుకోవాలి
X

దిశ, కామారెడ్డి : అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం 5కే రన్ ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే అంశంతో మున్సిపల్ కార్యాలయం నుంచి 5 కే రన్ ఇందిరా గాంధీ స్టేడియం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి ప్రజాస్వామ్య పరిణతిని చాటాలన్నారు. ఓటు వజ్రాయుధం వంటిదని, ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దని సూచించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును తమకు నచ్చిన నాయకున్ని ఎన్నుకొనే అవకాశం కల్పించిందని సూచించారు.

ఏప్రిల్ 1, 2024 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని, పోలింగ్ శాతాన్ని పెంచడానికి తమ వంతు తోడ్పాటును అందించాలని కోరారు. కుల, మతాలు, జాతి భేదం లేకుండా రాజ్యాంగం తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసే అవకాశాన్ని ఇచ్చిందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ, కామారెడ్డి ఆర్డీఓ రఘునాథ్ రావు, సీపీఓ రాజారాం, ఎన్నికల నోడల్ అధికారి వెంకటేష్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, కార్యదర్శి సాయిలు, టీజీవో అధ్యక్షుడు దేవేందర్, ప్రధాన కార్యదర్శి సాయి రెడ్డి, ప్రతినిధులు, యువకులు, ఉద్యోగులు, ఎస్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీరులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed