ప్రతిష్టాత్మక ఐటీఐలో పవరేది..?

by Disha Web Desk 12 |
ప్రతిష్టాత్మక ఐటీఐలో పవరేది..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దశాబ్దాల చరిత్ర కలిగిన నిజామాబాద్ ప్రభుత్వ ఐటీఐలో 20 రోజులుగా విద్యార్థులకు ప్రాక్టికల్ తరగతులు జరగడం లేదు. 20 రోజుల కింద అకాల వర్షాల సమయంలో పవర్ కంట్రోలర్లు దగ్ధమయ్యాయి. బాలుర ఐటీఐలో పవర్ కంట్రోలర్లు కాలిపోవడం, ఉన్న జనరేటర్ పని చేయకపోవడంతో విద్యార్థులకు ప్రాక్టికల్ తరగతులు కరువయ్యాయి. విద్యార్థులు ఐటీఐ కి వస్తున్నా కేవలం థియరీ తరగతులకు పరిమితమయ్యారు. సార్లు వచ్చినా విద్యార్థులు తరగతుల్లో థియరీ పాఠాలు వినడం, మిగతా సమయాల్లో చెట్ల కిందనే గడిపి వెళ్లిపోతున్నారు. 20 రోజులుగా పవర్ కంట్రోలర్లకు మరమ్మతులు చేసే యత్నాలు విఫలమయ్యాయి. దీంతో కొత్తవి బిగించేందుకు బడ్జెట్ లేక కళాశాల ప్రిన్సిపాల్‌తోపాటు ట్యూటర్లు ఏమి చేయలేక సతమతమవుతున్నారు.

ప్రభుత్వ ఐటీఐకి 2018 నుంచి బడ్జెట్ కేటాయింపులు నిలిచిపోయినట్లు సమాచారం. 320మంది విద్యార్థులకు 11 ట్రేడ్‌లలో శిక్షణ ఇచ్చే ప్రభుత్వ ఐటీఐలో కరెంట్ లేకపోవడంతో దానిని పునరుద్దరించేందుకు చందాలు వేసుకునేందుకు కళాశాల ప్రిన్సిపాల్‌తోపాటు ట్యూటర్లు ముందుకొచ్చారు. వందల మంది విద్యార్థులు చదివే ఐటీఐలో కరెంట్ పునరుద్దరించుకోలేని స్థితిలో బడ్జెట్ లేక సతమతమవుతున్నామని విద్యార్థులు లబోదిబోమంటున్నారు. ప్రాక్టికల్స్ లేకపోతే ఐటీఐలో శిక్షణ అనేది ఉత్తదే అని చెప్పాలి. ఈ విషయంపై ప్రిన్సిపాల్ కోటిరెడ్డి మాట్లాడుతూ 20 రోజుల కింద పవర్ కంట్రోలర్ కాలిపోయిన విషయాన్ని అధికారులకు నివేధించామని తెలిపారు. బడ్జెట్ నిధుల కేటాయింపు ఆలస్యం కావడంతో స్వయంగా మరమ్మతులు చేయించుకుని తరగతులు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.



Next Story

Most Viewed