వారసులకు షాక్ ఇచ్చిన సీఎం సర్వే.. వచ్చే ఎన్నికల్లో వారికి నో ఛాన్స్..!

by Disha Web Desk 12 |
వారసులకు షాక్ ఇచ్చిన సీఎం సర్వే.. వచ్చే ఎన్నికల్లో వారికి నో ఛాన్స్..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండగా ఏడుగురు శాసనసభ్యులు మినహా మిగిలిన వారు పోటీకి సై అంటే సై అంటున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, బాన్సువాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి తమకు టికెట్లు ఇవ్వవద్దని తమ వారసులకు ఇవ్వాలని కోరగా నాడే కేసీఆర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీఎం కేసీఆర్ నిర్వహించిన సర్వేల ఆధారంగా టికెట్ల కేటాయింపు జరుగుతుండగా పార్టీ పరిస్థితులు, ప్రజావ్యతిరేక, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులకు అనుగుణంగా టికెట్లను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కేసీఆర్ నిర్వహించిన సర్వేలో ఉమ్మడి జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో పార్టీకి గడ్డు పరిస్థితులు ఉన్నాయని కాబట్టి సిట్టింగ్ లే పోటీ చేయాలని ఆదేశించినట్లు తేటతెల్లమైంది.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సీనియర్‌గా పేరొందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి రెండు పర్యాయాలుగా తన వారసులకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోచారం అభ్యర్థనను కేసీఆర్ మన్నించలేదు. గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ పోర్టుపోలియోను అప్పగించి పెద్ద బాధ్యతను అప్పగించిన కేసీఆర్ రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సభాపతిగా బాధ్యతలు అప్పగించారు. కేసీఆర్ 2018 ఎన్నికల సందర్భంగా పోచారానికి ఇచ్చిన హామీ మేరకే ఆయన తనయుడు భాస్కర్ రెడ్డిని ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ గా చేశారని చెప్పొచ్చు. ఈసారైనా తన కొడుకుల్లో ఒకరిని ఎమ్మెల్యే చేయాలని ఇవే తనకు చివరి ఎన్నికలని పలు దఫాలుగా సమావేశాల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు.

కానీ నియోజకవర్గంలో పరిస్థితులు పోచారం శ్రీనివాస్ రెడ్డి కంటే ఆయన కుటుంబం పై వ్యతిరేకత పెరిగిందన్న వాదనలు ఉన్నాయి. పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాదని వారసులకు టికెట్ ఇస్తే పరిస్థితులు అనుకూలంగా ఉండవన్న చర్చ జరుగుతుంది. ఇటీవల సీఎం కేసీఆర్ చేయించిన సర్వేలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. దాంతో ఈసారి కూడా వారసులను కాకుండా గెలుపు గుర్రాలకే టికెట్లను ఇవ్వాలని కేసీఆర్ సంకల్పించారని తెలిసింది. ఉమ్మడి జిల్లాలో విస్తరించిన నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి దీటైన అభ్యర్థి ప్రతిపక్షాలల్లో లేరని కేసీఆర్ నమ్ముతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి పోచారమే పోటీ చేయాలని కేసీఆర్ ఆదేశించడంతో గత కొన్ని రోజులుగా తానే బరిలో ఉంటున్నానని ప్రకటన వెనుక పరమార్థం అదే అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

నిజామాబాద్ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా బాజిరెడ్డి గోవర్ధన్‌కు పేరు ఉంది. ఇప్పటివరకు ఆరు సార్లు పోటీ చేసి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీఆర్ఎస్‌లో 2014 ఎన్నికల సందర్భంగా చేరిన ఆయనకు మంత్రి పదవి అన్నది అందని ద్రాక్షలాగే ఉంది. గతంలో నక్సల్స్ దాడిలో గాయపడ్డ, రోడ్డు ప్రమాదంలో తప్పించుకున్న బాజిరెడ్డికి ఆరోగ్య పరిస్థితులు అంతగా బాగా లేవని 2018 ఎన్నికల్లోనే తన వారసుడైన జగన్‌కు టికెట్ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఎవరికి కూడా వారసులకు టికెట్ ఇవ్వకపోవడంతో జిల్లాలోనూ కేసీఆర్ బాజిరెడ్డికి టికెట్ ఇవ్వలేదు. దాంతో 2018 లో గెలిచిన బాజిరెడ్డి రెండవ దఫా ప్రభుత్వంలో మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. అదే విధంగా తన తనయుడిని జిల్లా పరిషత్ చైర్మన్ చేయాలని ధర్పల్లి జడ్పీటీసీగా గెలిపించారు. కానీ అక్కడ కూడా బాజిరెడ్డి ఆశలు అడియాశలయ్యాయి.

జగన్‌కు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవితో సరిపెట్టారు. రెండేళ్ల క్రితం అనూహ్యంగా మంత్రి పదవి కాకుండా ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత కూడా బాజిరెడ్డి ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో ఈ సారైనా కచ్చితంగా టికెట్ ఇవ్వాలని కోరిన నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బాజిరెడ్డి బరిలో ఉంటారని తేల్చి చెప్పిన మాటలు తెలిసింది. పార్టీలోనూ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం, ప్రతిపక్షాలకు బాజిరెడ్డిని మించిన అభ్యర్థి లేరనేది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ చేయించిన సర్వేలో వచ్చిన ప్రతికూల ఫలితాల నేపథ్యంలో బాజిరెడ్డి ఏడోసారి బరిలో ఉండడం అనివార్యంగా కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై బాజిరెడ్డి ఇప్పటి వరకు జరిగిన పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో ఈ విషయాన్ని ప్రకటించకపోయినా ఎన్నికల వేళ జరిగేది అదేనని పార్టీలో చర్చ జరుగుతుంది.



Next Story

Most Viewed