సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు పోచారం ఉంటారు..

by Disha Web Desk 20 |
సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు పోచారం ఉంటారు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దేశంలోనే అతి ప్రాచీణమైన ప్రాజెక్టు నిజాంసాగర్ వట్టిపోవడాన్ని చూసి తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టడానికి ఒక కారణమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయం 8వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. తిమ్మాపూర్ లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో పాల్గొని వెంకన్న కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సమాఖ్య పాలనలో నీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. సింగూరు నీటి కోసం రైతులు ఉద్యమించారని గుర్తు చేశారు.

బాన్సువాడ ప్రాంతంలో తలాపునే నిజాంసాగర్ ఉన్నా సాగుకు చాలా ఇబ్బంది అయ్యేది అని, ఇప్పుడు రూ.1500 కోట్ల వరి పంట సాగుతుందన్నారు. గతంలో ఇక్కడ నీళ్ళ కోసం పోచారం దీక్షలు చేశారని తాను తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టడానికి నిజాంసాగర్ నీళ్లు కూడా ఒక కారణమని అన్నారు. రైతుల బాధలు తెలుసుకుకాబట్టే పోచారం పనుల కోసం పట్టుబడుతాడని అన్నారు. ఇప్పుడు బాన్సువాడ అభివృద్ది కోసం కృషి చేస్తున్నారని కీతాబునిచ్చారు. ముఖ్య‌మంత్రి స్పెష‌ల్ పంఢ్ నుండి బాన్సువాడ అభివృద్ది కోసం 50 కోట్ల రూపాయ‌లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నిజాంసాగర్ ఎప్పుడు నిండే ఉంటదని, ఇక ఎప్పుడు ఎండిపోయే పరిస్థితి రాదన్నారు. నేనున్నన్ని రోజులు పోచారం ఉంటారని, మీ అవసరం బాన్సువాడకు ఉందని పోచారం శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న సేవలను సీఎం కేసీఆర్ పొగిడారు.

కామారెడ్డి జిల్లా బీర్కూర్ లోని తిమ్మాపూర్ లో గల తెలంగాణ తిరుమల దేవస్థానం వార్షికోత్సవానికి హాజరైన సీఎం కేసీఆర్ దంపతులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దాతల సహకారంతో రెండు కేజీల బంగారు కిరిటాన్ని వెంకటేశ్వర స్వామికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సమర్పించారు. తిమ్మాపూర్ లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా ఉమ్మడి జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Next Story