ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి

by Disha Web Desk 15 |
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి
X

దిశ, కామారెడ్డి క్రైమ్ : రానున్న పార్లమెంటరీ ఎన్నికల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ పేర్కొన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ.. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల సంఘం సూచనల ప్రకారం బాధ్యతగా విధులు నిర్వర్తించాలని తెలియజేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక వ్యక్తుల, రౌడీషీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో భరోసా కల్పించే విధంగా పనిచేయాలని తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగులు, జూదం, మట్కా అలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అక్రమ మద్యం,

నగదు రవాణాను నిరోధించడంలో భాగంగా చెక్ పోస్ట్ లలో విధులు నిర్వర్తించే సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. సరైన ఆధారాలు లేకుండా ఎవరైనా పరిమితికి మించి నగదును రవాణా చేస్తూ పట్టుబడితే ఎన్నికల నియమావళి ప్రకారం కేసుల నమోదు చేయాలని తెలిపారు. ప్రతి కేసులో 'క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్' ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ నిషేధిత గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసలై యువత తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. దొంగతనం కేసుల్లో ప్రస్తుతం పోలీసు శాఖ వినియోగిస్తున్న

సాంకేతికతను ఉపయోగించి నేరస్తులను పట్టుకుని సొత్తును రికవరీ చేసి బాధితులకు త్వరతగతిన అందేలా చూడాలని కోరారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి (బ్లాక్ స్పాట్స్) వాటి నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను పాటించకుండా మద్యం

సేవించి వాహనాలను నడుపుతూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే విధులలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని గుర్తించి వారికి అవార్డులు అందజేయడం జరిగింది. వారిలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్. శ్రీనివాస్ , టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఏ. తిరుపయ్య, సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సంతోష్ కుమార్, సీసీఎస్ ఎస్సై ఎండి. ఉస్మాన్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుళ్లు సయ్యదుద్దీన్, కిషన్, సీసీఎస్ కానిస్టేబుళ్లు మైసయ్య, శ్రావణ్ కుమార్, రాజేంద్రకుమార్, గణపతి, రవి, శ్రీనివాస్, స్వామి, భద్రయ్య, ముఖేష్, శ్రీకాంత్, యోగేష్, మల్లేష్ వారికి అవార్డులతో పాటు అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్‌పీలు నాగేశ్వరరావు, సత్యనారాయణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ జార్జ్ , డీసీఆర్‌బీ ఇన్స్పెక్టర్ మురళి , సీఐలు , తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed