జ్యోతి పసిడి వెలుగులు

by Dishanational3 |
జ్యోతి పసిడి వెలుగులు
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ ఆర్చర్, తెలుగమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ అదరగొట్టింది. చైనాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-1 టోర్నీలో మూడు స్వర్ణాలు కైవసం చేసుకుంది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించడంతో మహిళల, మిక్స్‌డ్ జట్లు స్వర్ణాలు గెలవడంలో కీలక పాత్ర పోషించింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్‌లో జ్యోతి 146(9)-146(9*) తేడాతో మెక్సికో క్రీడాకారిణి ఆండ్రియా బెకెర్రా‌ను షూటాఫ్‌లో ఓడించింది. ప్రత్యర్థి నుంచి జ్యోతి గట్టి సవాల్ ఎదుర్కొంది. 4 రౌండ్లు పూర్తయ్యే సరికి ఆమె 118-117తో వెనుకబడింది. చివరిదైన ఐదో రౌండ్‌‌ను నెగ్గి స్కోర్లను సమం చేసి మ్యాచ్‌ను షూటాఫ్‌కు మళ్లించింది. అక్కడ ఇద్దరు 9పాయింట్లు సాధించినప్పటికీ జ్యోతి తన బాణాన్ని ‘ఎక్స్’(కేంద్రానికి దగ్గరగా) గురి పెట్టడంతో విజేతగా నిలిచింది.

జ్యోతి, అదితి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన మహిళల కాంపౌండ్ జట్టు కూడా స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్‌లో భారత త్రయం 236-225 తేడాతో ఇటలీ జట్టును ఓడించింది. అలాగే, జ్యోతి, అభిషేక్ వర్మలతో కూడిన మిక్స్‌డ్ జట్టు ఫైనల్‌లో 158-157 తేడాతో ఎస్టోనియా ఆర్చర్లు లిసెల్ జాత్మా, రాబిన్ జాత్మా ద్వయంపై విజయం సాధించింది. ఇక, కాంపౌండ్ పురుషుల జట్టు కూడా సత్తాచాటింది. ఫైనల్‌లో అభిషేక్, ప్రియాన్ష్, ప్రథమేశ్ త్రయం238-231 తేడాతో నెదర్లాండ్స్ ఆర్చర్లను చిత్తు చేసి స్వర్ణ పతకం సాధించింది. మరోవైపు, కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రియాన్ష్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్‌లో నికో వీనర్(ఆస్ట్రియా)చేతిలో 150-147 తేడాతో ఓడిపోయి రజతంతో సరిపెట్టాడు. వ్యక్తిగత విభాగంలో అతనికి ఇదే తొలి ప్రపంచకప్ పతకం. మొత్తంగా కాంపౌండ్ విభాగంలో నాలుగు స్వర్ణాలు, ఒక రజతంతో భారత ఆర్చర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు.



Next Story

Most Viewed