10 లక్షల మంది ఉబెర్ డ్రైవర్లతో ప్రపంచంలోనే మూడో దేశంగా భారత్

by Dishanational1 |
10 లక్షల మంది ఉబెర్ డ్రైవర్లతో ప్రపంచంలోనే మూడో దేశంగా భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఉబెర్ డ్రైవర్ల సంఖ్య 10 లక్షల మైలురాయికి చేరిందని సంస్థ సీఈఓ దారా ఖోస్రోషాహి ప్రకటించారు. ఈ ఏడాది మార్చి త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. 10 లక్షల డ్రైవర్ల మార్కును సాధించిన యూఎస్, బ్రెజిల్ తర్వాత మూడో దేశంగా భారత్ నిలిచిందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని కొత్త ప్రాంతాలకు సైతం వేగంగా విస్తరిస్తున్నాం. వినియోగదారులకు మెరుగైన సేవల కారణంగా 17 శాతం సానుకూల వృద్ధిని సాధించగలుగుతున్నామని దారా ఖోస్రోషాహి చెప్పారు. భారత్‌లో తమ డ్రైవర్ల ఆదాయం కనీస వేతనం కంటే ఎక్కువగానే ఉందని, ఇది సౌకర్యవంతమైన సంపాదనకు సానుకూలమని ఆయన వివరించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత మార్కెట్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. బుకింగ్‌లు, లావాదేవీలు సులభంగా జరుగుతున్నాయి. ఇతర పెద్ద మార్కెట్లలో సాధారణ వృద్ధి ఉన్నప్పటికీ, వేగవంతమైన విస్తరణ భారత్‌లో కీలకంగా ఉందని దారా ఖోస్రోషాహి తెలిపారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఓఎన్‌డీసీతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు గురువారం ఉబెర్ ప్రకటించింది. ఈ సహకారం ద్వారా దేశంలోని ప్రజలకు రోజువారీ మొబిలిటీ అవసరాలకు ఉబెర్ సరైన ప్లాట్‌ఫామ్‌గా మారుతుందనే విశ్వాసం ఉందని ఉబెర్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు ప్రభ్‌జీత్ సింగ్ వెల్లడించారు.

Next Story

Most Viewed