కాంగ్రెస్ మాటలను ప్రజలు నమ్మరు : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Disha Web Desk 11 |
కాంగ్రెస్ మాటలను ప్రజలు నమ్మరు : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ. చేవెళ్ల : కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలను తెలంగాణ ప్రాంత ప్రజలు నమ్మరని చేవెళ్ల బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన చేవెళ్లలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో చిప్ప పెట్టి వెళ్లిపోయాడని ఎద్దేవా చేశారు. దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యమని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి లేరని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ కి భయపడి పారిపోయాడని కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు.

రిజర్వేషన్ల విషయంలో భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆ ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన కోరారు. అనంతరం పలు గ్రామాల బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు బిజెపిలో చేరారు. వారికి కమలం పువ్వు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కొరకు కష్టపడే వారికి మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. చేరిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం,బిజెపి సీనియర్ నాయకులు అసెంబ్లీ కన్వీనర్ ప్రతాపరెడ్డి, అసెంబ్లీ ఇన్చార్జి విష్ణువర్ధన్ రెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి ,మండల అధ్యక్షులు పాండురంగారెడ్డి, సీనియర్ నాయకులు పరమేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, మధుసూదన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed